24 March, 2026 | 4:47 AM

హరీశ్ X భట్టి

24-03-2026 01:28 AM

ఐదు డీఏలు ఎప్పుడిస్తారు?

  1. ఇప్పటికీ పీఆర్సీ లేదు
  2. రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంతా కాదు
  3. నిధులు లేవా?.. మనసు లేదా?
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగుల కు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, అవి ఎప్పటిలోగా చెల్లిస్తారో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూటి గా సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం నా ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పష్టంగా సమాధానమివ్వాలని డిమాండ్‌చేశారు.

పీఆర్సీ కమిటీకి మార్చి 31, 2026 వరకు పొడిగించారని, ఆ గడువు ముగియడానికి ఇంకో వారం, ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మ్యాని ఫెస్టోలో చెప్పారని, రెండున్నరేండ్లు కావొస్తున్నా ఇప్పటివరకు పీఆర్సీ లేదు.. మళ్లీ పొడిగిస్తారా అని ప్రశ్నించారు. కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు.

గతంలో కేసీఆర్ ఐఆర్ ఇచ్చి ఆదుకున్నారని, మీరైనా ఐఆర్ పెంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తారా అని ప్రశ్నించారు. 30, 35 ఏళ్లపాటు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంతా కాద ని, జీవిత చరమాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు రాష్ట్రంలో ఎంతమం ది రిటైర్ అయ్యారు? వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత? ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది? మిగతా బకాయిలు ఎప్పటిలో గా పూర్తిగా చెల్లిస్తారో చెప్పాలన్నారు.

రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాల్సిన వారు.. బకాయిల కోసం సెక్రటేరియట్ చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని, రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా? లేక మనసు లేదా? అని ప్రశ్నించారు.

ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు, మూసీకి లక్ష కోట్లు, అందాల పోటీలకు, ఫుట్ బాల్ షోల కు డబ్బులున్నాయని, సీఎం వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్, భట్టి విక్రమార్క మూడో క్యాంప్ ఆఫీస్ కట్టుకునేందుకు డబ్బులు ఉంటాయి.. కానీ పీఆర్సీ, డీఏలకు డబ్బులు లేవంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్‌చేశారు. 

త్వరలోనే ఇస్తాం

  1. మూడు డీఏలు పెండింగ్ పెట్టిన గత ప్రభుత్వం
  2. విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత త్వరగా బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తిచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేతన సవరణ కమిషన్ ప్రస్తుత స్థితిపై బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్ అడిగిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు.

బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి నెల 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లిన మూడు డీఏలను తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం పదవి విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు, నాలుగవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 ఏండ్లకు పెంచిందని మండిపడ్డారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో 17 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజాప్రభుత్వంపై పడిందని గుర్తుచేశారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వం రూ.40,150 కోట్ల బకాయిలు పెట్టారని, ఈ విషయంపై సభలో శ్వేతపత్రం విడుదల చేశామని, ఆ బకాయిల్లో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల మొత్తం రూ.4,575 కోట్లు ఉన్నాయని స్పష్టంచేశారు.

తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల రూ.700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, రాబోయే రోజుల్లో బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రతినెలా చెల్లించే రూ.700 కోట్లను రూ.1000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నదని చెప్పారు.

తమ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు యావత్ క్యాబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉండటంతోనే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, బీఆర్‌ఎస్ హయాంలో హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అడిగి అలసిపోయాయని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను అమలు చేయబోతున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఉద్యోగులకు దాదాపు రూ.6,146 కోట్లు క్లియర్ చేశామని స్పష్టంచేశారు.

పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవని, తమ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదింపులు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేస్తున్నారని చెప్పారు.

ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలు పనిచేయకుండా, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు.