46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతా లకు చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠా గా ఏర్పడి రేషన్ లబ్ధిదారుల నుంచి రూ.10 నుంచి రూ. 12 వరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్ యజమానులకు రూ. 25 నుంచి రూ. 30 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పీడీఎస్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న తొమ్మిది మంది నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 2.5 లక్షల విలువైన 46 క్వింటాళ్ల బియ్యం, 4 క్వింటాళ్ల గోధుమలు, 1 వెయింగ్ మెషిన్, 1 ద్విచక్ర వాహనం, 1 వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
గజ్వేల్‌లో..
గజ్వేల్, జూన్ 13: గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ మార్గంలో డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, గజ్వేల్ పోలీసులు పట్టుకున్నారు. చేర్యాల మండలం పెద్దరాజుపేటకు చెందిన నూనె మహేందర్ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.






