బీజేపీ స్వయంకృతం
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి వరసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టడం ద్వారా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించనున్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన ప్రధానిగా మోడీ నిలుస్తారు. అయితే, 400కి పైగా స్థానాల్లో విజయం సాధించి రాజీవ్‌గాంధీ రికార్డును బ్రేక్ చేయాలనుకున్న ఆయన ఆశ మాత్రం నెరవేరలేదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మాట అటుంచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 273 సీట్లనూ బీజేపీ దక్కించుకోలేక పోయింది. సొంతంగా ఆ పార్టీబలం 240 వద్దే ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లాంటి మిత్రపక్షాలతో కలిపి 293 స్థానాలతో ప్రభుత్వాన్ని సులువుగా ఏర్పాటు చేయగలిగినప్పటికీ ప్రధాని మోడీ ప్రభ మాత్రం మసకబారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగులేని బలం కలిగిన ఆ పార్టీకి అక్కడే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. యూపీని కేంద్రంగా చేసుకుని హిందుత్వ అజెండాను దేశవ్యాప్తం చేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నా లు పూర్తిగా బెడిసికొట్టాయి. అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రతిష్ఠ పేరుతో ఆ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఆలయ ప్రతిష్ఠ తర్వాత బీజేపీ కార్యకర్తలు దేశమంతటా రాముడి అక్షింతలు పంచారు. ఆ పేరుతో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే, హిందువులు వేరు, హిందుత్వ వేరనే వాస్తవాన్ని కమలనాథులు మరిచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేయడాన్ని స్థానిక ప్రజలే హర్షించలేదనడానికి ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమే నిదర్శనం. ఉత్తరాదిన తమకు ఎదురుగాలి వీచడాన్ని పసిగట్టిన కమలనాథులు, ముఖ్యంగా మోడీ తమ ప్రచార సరళిని మార్చుకున్నారు. దక్షిణాదిపై ఎక్కువ గురిపెట్టి ఆయా రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్నించారు. అది నెరవేరలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఓటర్లు కాషాయ పార్టీని పూర్తిగా తిరస్కరించా రు. కేరళలో సురేశ్ గోపీ విజయం ఆ పార్టీ గొప్పతనం కాదని, వ్యక్తిగతం గా ఆయన విజయమే అనేది అందరికీ తెలిసిందే. కర్నాటకలోనూ జీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకున్నా, గతం కన్నా సంఖ్య తగ్గింది.
ఇక ఏపీలో కూటమి భాగస్వామిగా ఆ పార్టీకి దక్కింది మూడు సీట్లే అయినా, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన సాధించిన 1౮ సీట్లూ తన ఖాతాలోనే వేసుకోవచ్చునేమో కానీ సొంతబలం కాదు. ఎటొచ్చీ తెలంగాణలోనే పార్టీ బలం రెట్టింపైంది. అటు సీట్ల పరంగా రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో మిత్రపక్షాలతోపాటు బీజేపీ భారీసంఖ్యలో సీట్లు కోల్పోయింది. అక్కడ అధికార కూటమి మెజారిటీ స్థానాలు కోల్పోవడానికి శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలపై పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలే కారణమని చెప్పవచ్చు. అవి ఆ నేతలపట్ల ఓటర్లలో సానుభూతిని, అధికార కూటమిపట్ల ఆగ్రహాన్ని పెంచాయి. ముస్లిం మైనారిటీలు, మహిళల తాళిబొట్లు, ప్రత్యర్థి పార్టీల నేతలపై వ్యక్తిగత విమర్శలు వంటి దిగజారుడు ప్రచారమే పార్టీ సీట్లు భారీగా తగ్గడానికి కారణమయ్యాయి.
మణిపూర్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్‌లోను బీజేపీ బలాన్ని కోల్పోవడానికి పార్టీపట్ల స్థానిక ప్రజల ఆగ్రహమే కారణం. ఈ లోక్‌సభ ఎన్నికలపై ఆదినుంచి ఎంతో ఆసక్తి కనబరిచిన విదేశీ మీడియా ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోడీ ప్రభ మసకబారిందని వ్యాఖ్యానించింది. ఫలితాలు బీజేపీని షాక్‌కు గురి చేశాయని, మోడీ ప్రధానిగా మూడోసారి అధికారంలోకి వచ్చినా మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చిందని న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ లాంటి విదేశీ పత్రికలు అభిప్రాయపడ్డాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాల్సి ఉంటుందని పాక్ పత్రిక ‘డాన్’ పేర్కొంది. రాబోయేరోజుల్లో కమ లనాథుల పట్ల మిత్రపక్షాల వైఖరి ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.






