ఇతనొక సౌండ్ ఇంజినీర్!
హీరో రోహిత్ నారా 23వ చిత్రం పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాతో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శనివారం రోహిత్ నారాకు పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాతలు ఈ మూవీ టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజినీర్’ అనే టైటిల్ పెట్టారు.
ఈ పోస్టర్ రోహిత్ నారా తెల్లటి కుర్తా, పైజామా ధరించి, టెర్రస్ అంచున ప్రశాంతంగా ధ్యానం చేస్తూ సరికొత్త అవతారంలో కనిపించారు. టైటిల్‌తోపాటు, కథానా యకుడి ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక కాన్సెప్ట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. హాస్యనటుడు సుదర్శన్ వాయిస్‌తో ఈ వీడియో, రోహిత్ నారా పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, అతనికి ‘సౌండ్ ఇంజినీర్’ అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో రోహిత్ నారా సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. నరేశ్ వీకే, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, వెంకట్ సీ దిలీప్ డీవోపీగా, సుప్రియా బట్టేపాటి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.






