26 July, 2026 | 2:15 AM

హైదరాబాదీలపై గౌరవం పెంచే అమీర్ లోగ్

26-07-2026 12:00 AM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవిరెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట ప్రధాన పాత్రల్లో నటించగా.. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయబోతోంది. ఆగస్టు 21న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ శనివారం ప్రకటించారు.

ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో ‘అవ్వల్ దావత్’ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకుడు రమణారెడ్డి సోమ మాట్లాడుతూ.. “మాది నల్గొండలోని రాఘవపురం. నేను 97లోనే హైదరాబాద్‌కు వచ్చా. ఇక్కడి చాలా ఏరియాల్లో నివాసం ఉన్నా. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ తీశా. డబ్బులున్న వారు అమీర్ లోగా..?, సంతోషంగా ఉండేవారా..? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థమవుతుంది.

ఈ సినిమా చూసిన తర్వాత హైదరాబాద్ మనుషుల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది” అని తెలిపారు. నిర్మాత మాధవిరెడ్డి మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’లో చూపించే బస్తీలోనే నేను పుట్టి పెరిగా. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం నా భర్త రమణారెడ్డి. అందరూ మా సినిమాని చూసి మా ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.

నటుడు ఎంసీ హరి మాట్లాడుతూ.. “ఆగస్ట్ 21న మా సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకువెళ్తాం. అందరినీ ఆకట్టుకుంటాం” అన్నారు. నటుడు మనోజ్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు.. బిర్యానీ ఎలా ఉంటుంది.. క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుంది.. అని ఎవరైనా అడిగితే ‘అమీర్ లోగ్’ సినిమా చూపించండి” అని చెప్పగా.. ‘ఇది పక్కా తెలుగు, హైదరబాదీ చిత్రం.

అందరూ చూసి ప్రోత్సహించండి” అని నటుడు శశిధర్ కోరారు. ‘మా డైరెక్టర్ రమణారెడ్డి బస్తీలోని అందమైన బంధాలను మరింత అందంగా తెరపై చూపించారు. అంతా ఇది మా కథే అని రిలేట్ అవుతార’ని వేదా జలంధర్ తెలిపింది. సంగీత దర్శకుడు స్మరణ్‌సాయి మాట్లాడుతూ.. “సంస్కృతికి ప్రతీకగా తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం.

హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణారెడ్డి అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు సాయి యోగి, కీర్తి, గీత రచయిత మనోజ్‌కుమార్ కూడా మాట్లాడారు.