పట్టభద్రుల పోరుకు ఉద్యమకారుడే
కసరత్తు చేస్తున్న గులాబీ బాస్
అభ్యర్ధి ఎంపికపై మూడు జిల్లాల నేతలతో చర్చలు
ఎమ్మెల్యేగా అవకాశం దక్కని నాయకులకు చాన్స్
దూదిమెట్ల బాలరాజ్, పల్లె రవికుమార్, వాసుదేవరెడ్డి పేర్లు పరిశీలన
హైదరాబాద్, ఏప్రిల్ ౨ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఒక వైపు పార్లమెంటు ఎన్నికల పోరు సాగుతుండగా ఆయా పార్టీ నేతలు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 27న ఉపఎన్నిక ఉండటంతో ఇప్పటికే అధికార కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న పేరు ప్రకటించింది. బీజేపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీకి సేవలందిస్తున్న ఉద్యమనేతల పేర్లు పరిశీలించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
ఓయూ ఉద్యమ నేతలు, జర్నలిస్టుల్లో ఒకరి ఇద్దరి పేర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. గ్రాడ్యుయేట్‌కు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్ధి ఎంపిక కోసం పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ అభ్యర్థుల గెలుపు కోసం వారం రోజులుగా సాగుతున్న బస్సుయాత్రకు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ రావడంతో పట్టభద్రులు పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో యాత్ర పూర్తి కావడంతో అక్కడి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో చర్చలు జరిపి వలస నేతలకు కాకుండా ఉద్యమకారునికే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే ఆశించిన ఫలితం వస్తుందని సూచించడంతో ఆ దిశగా అభ్యర్థి ఎంపిక వేగవంతం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్, జర్నలిస్టు సంఘం నాయకుడు పల్లె రవికుమార్‌గౌడ్, వాసుదేవరెడ్డి పేర్లు పార్టీ పెద్దల పరిశీలనలో ఉండగా వారితో పాటు ఈడిగ అంజనేయులు గౌడ్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడు గోవింద్‌యాదవ్, బీజేపీ నుంచి వచ్చి రాకేశ్‌రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ భవన్‌లో టాక్. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ పెద్దలు పేర్కొన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికలకు ఈనెల 2న నోటిఫికేషన్, నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 9న నామినేషన దాఖలుకు తుది గడువు కాగా 10న నామినేషన్ల పరిశీలన, మే 13న ఉపసంహరణ ఉంటుంది.
ఈ ఎమ్మెల్సీ స్థానంలో రెండు పర్యాయాలు పల్లా రాజేశ్వరెడ్డి విజయం సాధించారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మన పార్టీ సీటు మనమే దక్కించుకోవాలని మూడు జిల్లాలకు చెందిన నేతలకు కేసీఆర్ సూచించినట్లు పలువురు నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు యువత కోసం 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని గొప్పగా ప్రకటించిందని ఇప్పటివరకు ఆ ఊసేలేదని, బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి తాము చేసినట్లు ప్రచారంలో ఊదరగొడుతుందని.. ఆ విషయాలు పట్టభద్రులకు వివరించాలని తెలిపారు. అదే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కరెంటు కోత, తాగునీరు సరఫరా చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందనే అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి గ్రాడ్యుయేట్లను తమవైపునకు తిప్పుకునేలా చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది.




