31 March, 2026 | 3:47 PM

మోదీ, రేవంత్ దొందూ దొందే

03-05-2024 01:46 AM

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామరావు

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): దేశంలో రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ రైలు, రూ.15లక్షలు అంటూ అనేక హామీలిచ్చి ప్రధానిగా మోదీ పీఠమెక్కి నిలువునా మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. అదే మాదిరిగా రాష్ట్రంలో  సీఎం రేవంత్‌రెడ్డి చాలా హామీలు ఇచ్చి అధికారం చేపట్టారని వాటిని అమలు చేయడంలో విఫలమైయ్యారని మండిపడ్డారు. గురువారం జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలో జరిగిన రోడ్ షోలలో మాట్లాడుతూ నగరంలో తాగునీటి, కరెంటు కష్టాలు మొదలైయ్యాయని, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్‌లో గెలిచిన దానం నాగేందర్ ప్రజల తీర్పును అపహాస్యం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుని ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పొరపాటున గెలిస్తే బీజేపీలోకి వెళతారని, అసలు సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని తాను ఊరికే మాటలు చెప్పడం లేదన్నారు. జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారని, హైదరాబాద్‌లో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.