మంత్రాలు చేస్తున్నాడని హత్య
- పెట్రోల్ పోసి కాల్చివేత
నిర్మల్ జిల్లాలోని గిరిజన గూడెంలో దారుణం
౩ రోజుల తర్వాత వెలుగులోకి
నిర్మల్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గండి గోపాల్ పూర్ గిరిజన తండాలో దారుణం చోటుచేసుకుంది. గండి గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య(55) అనే వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన మోతిన నరేష్, మల్లేష్ ఇద్దరు కర్రలతో కొట్టి చంపిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
మోతిన నరేష్, మల్లేష్ కుటుంబంలో గత కొద్దికాలంగా వివిధ వ్యాధులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతు న్నారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాకపోవడంతో దేశనేని భీమయ్య మంత్రం చేశాడన్న అనుమానం వారిలో కలిగింది. ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 10న పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న దేశినేని భీమయ్యను కర్రలతో కొట్టి చంపేశారు.
ఈ విషయం బయటకు పొక్కకుండా భీమయ్య మృతదేహాన్ని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయి బూడిద కావడంతో ఇంటికి వచ్చిన నరేష్, మల్లేష్.. తమకేమీ తెలియనట్టు అందరితో కలిసిమెలిసి తిరగసాగారు. భీమయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఆధారాలు లభించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద కేసు నమోదు చేశారు.
శనివారం ఉదయం తండాకు చెందిన కొందరు పశువుల మేత కోసం అడవికి వెళ్లగా ఓ ప్రాంతంలో బూడిద, అందులో శరీర అవయవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పడంతో నరేష్, మల్లేష్‌లను అదుపులో తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్టు సీఐ అజయ్ కుమార్ తెలిపారు.




