మెస్సీ.. మెస్సీ!
ఉర్రూతలూగిన ఉప్పల్ స్టేడియం
సాకర్ దిగ్గజం హైదరాబాద్ టూర్ సక్సెస్
పకడ్బందీ ఏర్పాట్లతో విజయవంతం
మెస్సీని చూసి కేరింతలు కొట్టిన ఫ్యాన్స్
ఆద్యంతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా సీఎం రేవంత్
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
* సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ సూపర్ సక్సెస్ అయింది. కోల్‌కతా ఘటన తప్పిదాలు ఇక్కడ జరగకుండా పోలీసులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడంతో మెస్సీని దగ్గర నుంచి వీక్షించాలన్న ఫ్యాన్స్ కల నెరవేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్ స్వాగతం పలికిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి మెస్సీ బృందం ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లింది.
అక్కడ రూ.10 లక్షలతో పాసులు కొనుగోలు చేసిన అభిమానులతో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న మెస్సీ ప్యాలెస్ అందానికి ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా ప్యాలెస్ గురించి రాహుల్ గాంధీని, నిర్వాహకులు ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మరోవైపు మెస్సీ స్టేడియానికి రాకముందు అక్కడ నిర్వహించిన కార్యక్రమాలు అభిమానులను విశేషంగా అలరించాయి.
సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు పాటతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అలాగే మెస్సీకి ట్రిబ్యూట్‌గా నిర్వహించిన లేజర్ షో ఈవెంట్‌కే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియానికి వెళ్లిన మెస్సీ, అతని సహచురులు సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌తో కలిసి అభిమానులను ఉత్సాహపరిచారు.
ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఉత్సాహంగా తిలకించిన మెస్సీ ఇరు జట్ల ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారిలో జోష్ నింపారు. కాసేపు ఫుట్‌బాల్ ఆడుతూ , ప్రేక్షకులకు అభివాదం చేస్తూ, వారిపైకి ఫుట్‌బాల్స్ కిక్ చేస్తూ సందడి చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ గోల్స్ కొట్టినప్పుడు మెస్సీ ఉత్సాహంగా ఆయనను అభినందించడం హైలెట్‌గా నిలిచింది. ఫుట్‌బాల్ క్లినిక్స్‌లో చిన్నారులకు టిప్స్ ఇచ్చిన మెస్సీ ఇరు జట్లతోనూ ఫొటోలు దిగారు. 3 వేల మందికి పైగా పోలీసులు, నిర్వాహకులు, ఇతర సిబ్బందితో కలిసి ఈవెంట్‌ను విజయవంతం చేశారు. స్టేడియానికి ౨౮ వేల మంది అభిమానులు తరలివచ్చారు.
షహర్ మే షహన్ షా!
హైదరాబాద్‌లో మెస్సీ టూర్ సూపర్ సక్సెస్
- ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన సాకర్ స్టార్
- స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఫ్రెండ్లీ మ్యాచ్
- మెస్సీ టీంపై రేవంత్ టీందే గెలుపు
- అలరించిన మ్యూజికల్ కన్సర్ట్, లేజర్ షో
మెస్సీ... మెస్సీ...మెస్సీ... హైదరాబాద్‌లో శనివారం అంతటా వినిపించిన ఒకే ఒక మాట.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ ముగిసేవరకూ మెస్సీ నామస్మరణతో అభిమానులు ఊగిపోయారు. కోల్‌కతా ఘటనతో కాస్త టెన్షన్ కనిపిం చినా హైదరాబాద్ ఆర్గనైజర్లు మాత్రం పకడ్బందీ ఏర్పాట్లతో ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. కోల్‌కతాలో మెస్సీని చూసే అవకాశం అభిమానులకు సరిగ్గా దక్కలేదు.
దీంతో అక్కడి తప్పిదాలు ఇక్కడ జరగ కుండా స్టేడియంలో ఉన్నంతసేపు మెస్సీ అభిమానులకు అభివాదం చేస్తూ వారిని అలరించాడు. అటు సీఎం రేవంత్‌రెడ్డి సాకర్ డ్రెస్‌లో గ్రౌండ్‌లోకి దిగి గోల్స్ కొడితే.. మెస్సీ చప్పట్లతో ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయడం హైలెట్‌గా నిలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సీ పర్యటన ఆద్యంతం హైదరాబాద్‌లోనే గడిపారు. మొత్తం మీద ప్రపంచ సాకర్‌లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు లైఫ్‌టైమ్ మెమరీస్‌ను అందించాడు.
ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
గోట్ టూర్‌లో భాగంగా మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ కోల్‌కతాలో ఈవెంట్ అసంపూర్తిగా ముగియడంతో నేరుగా హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మెస్సీ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు. అంతకుముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు చేరుకోగా.. మెస్సీ వచ్చిన తర్వాత వీరంతా నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్ళారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఎయిర్‌పోర్టు దగ్గర భారీగా భద్రతను పెంచారు. అభిమానులు చాలా మంది శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి మెస్సీకి కేరింతలతో వెల్‌కమ్ చెప్పారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వీరందరినీ చాలా దూరంలోనే ఆపేశారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్
ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లిన మెస్సీ అక్కడ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రూ.10 లక్షలతో ప్రత్యేకంగా పాసులు కొనుగోలు చేసిన అభిమానులతో ఫోటోలు దిగి, ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీలను బహుమతిగా అందించాడు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ గడిపాడు. అటు ఫలక్‌నుమా ప్యాలె స్ అందాలకు మెస్సీ ఫిదా అయిపోయాడు. మెస్సీతో పాటు వచ్చిన అతని సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ సైతం ప్యాలెస్ అందాన్ని చూసి ప్రశంసలు కురిపించారు.
ఈ టూర్ ఆర్గనైజర్ పార్వతిరెడ్డిని ప్యాలెస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ తర్వాత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటించిన మెస్సీ ఫలక్‌నుమా ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు. రాహుల్ గాంధీ తో కలిసి మెస్సీ బృందం ప్యాలెస్ మొత్తాన్ని వీక్షించింది. ప్యాలెస్ వివరాలను రాహుల్‌ను అడిగి తెలుసుకున్నారు.
మెస్సీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ముందు స్టేడియానికి వచ్చారు. తర్వాత మెస్సీ బృందం 20 కార్ల భారీ కాన్వాయ్‌తో స్టేడియానికి చేరుకుంది. మెస్సీ వచ్చిన వీడియో స్టేడియంలోని లైవ్ స్క్రీన్‌పై చూపించడంతో ఫ్యాన్స్ కేరింతలతో దద్దరిల్లింది. కొద్దిసేపు వీఐపీ రూమ్‌లో ఉన్న మెస్సీ తర్వాత పెవిలియన్‌లో ఉండే గ్లాస్ రూమ్‌లో నిలబడి మ్యాచ్‌ను వీక్షించాడు. ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగా మరోవైపు మెస్సీ రాకతో స్టేడియంలోని ప్రేక్షకుల సందడికి హద్దే లేకుండా పోయింది. సాకర్ డ్రెస్‌లో వచ్చీ రావడంతోనే మ్యాచ్ బరిలోకి దిగిన సీఎం రెండు గోల్స్ కొట్టి సింగరేణి టీమ్‌ను గెలింపించారు.
మెస్సీ స్పీచ్
చివర్లో మెస్సీ అభిమానులను ఉద్ధేశించిన మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ అభిమానుల ఉత్సాహం తనకు సరికొత్త శక్తి నిచ్చిందంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ ముగిసిన తర్వాత భారీ బం దోబస్తు మధ్య మెస్సీ బృందం తిరిగి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంది. శనివారం రాత్రికి అక్కడే బస చేయనున్న మెస్సీ బృందం ఆదివారం ముంబైకి వెళుతుంది.ఇక ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, అల్లు అర్జున్ కుమా రుడు, కుమార్తె, పలువురు సెలబ్రిటీలు ఈవెంట్‌కు హాజరయ్యారు.
గ్రౌండ్‌లోకి మెస్సీ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్
ముందుగా నిర్ణయించినట్టు చివరి 5 నిమిషాల టైమ్‌లో మెస్సీ గ్రౌండ్‌లోకి వచ్చారు. మెస్సీని చూసిన ప్రేక్షకుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌ను దగ్గ రుండి చూసిన మెస్సీ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచినప్పుడు మెస్సీ ఉత్సాహంగా చప్పట్లతో అభినందించారు. అనంతరం రెండు టీమ్స్‌తో కలిసి ఫోటోలు దిగారు. తర్వాత స్టేడియం అంతా కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు.
కోల్‌కతా టూర్‌లో జరిగిన తప్పిదాలు ఇక్క డ జరగకుండా నిర్వాహకులు పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మెస్సీని దగ్గర నుంచి చూడాలనుకున్న అభిమానుల కల నెరవేరింది. స్టేడియం అంతటా తిరుగుతూ కొన్ని చోట్ల మెస్సీ ఫుట్‌బాల్స్‌ను ప్రేక్షకుల పైకి కిక్ చేసారు ఆయన సహచ రుడు రోడ్రిగో డిపాల్ కూడా బాల్స్‌ను కిక్ చేశారు. వీరి కిక్ చేసిన బాల్స్ దొరికిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కొన్ని ఫుట్‌బాల్స్‌పై మెస్సీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు.
అనంతరం నాలుగు జూనియర్ టీమ్స్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ క్లినిక్స్‌లను సందర్శించి టిప్స్ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మనుమడితో మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. అలాగే పలువురు చిన్నారులతో సైతం ఫుట్‌బాల్ ఆడి వారిలో జోష్ నింపారు. ఇక మ్యాచ్‌లో విజేతగా నిలిచిన సింగరేణి ఆర్‌ఆర్ టీమ్‌కు మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్రోఫీ అందించారు. రన్నరప్ అపర్ణ టీమ్‌కు ట్రోఫీ అందించి ఇరు జట్లతో ఫోటోలు దిగారు.
ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్
మెస్సీ రావడానికి ముందు స్టేడియంలో అభిమానుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. వారి వెచ్చించిన టికెట్ ధరకు అనుగుణంగా వినోదాన్ని అందించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెంచింది. టాలీవుడ్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ట్రిపులార్ నాటు నాటు పాటకు స్టేడియం దద్దరిల్లింది. వీరి మ్యూజికల్ ప్రోగ్రాం జరుగుతున్నంత సేపూ స్టేడియంలో ఫ్యాన్స్ హుషారుగా స్టెప్పులు వేస్తూ గడిపారు.
స్టేడియం వద్ద భారీ భద్రత
కోల్‌కతా ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు మెస్సీ ఈవెంట్‌ను సక్సెస్ చేసేం దుకు భద్రతను భారీగా పెంచారు. అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకురాకుండా ముళ్లకంచెలు వేసారు. అనంతరం స్టేడియం అంతటా కలియదిరిగి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు పరిశీలించారు. డీజీపీ శివధర్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పర్యవేక్షణలో దాదాపు 3 వేల మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
ఇక టికెట్లు ఉన్నవారిని మాత్రమే స్టేడి యం దగ్గరకు అనుమతించారు. క్రికెట్ మ్యాచ్‌ల టైమ్‌లో ఎవ్వరూ ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఎప్పటికప్పుడు రద్దీని క్లియర్ చేశారు. ఆఫ్‌లైన్ టికెట్లు కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు ఇవ్వడం కూడా రద్దీని నియంత్రించేందుకు బాగా కలిసొచ్చింది. క్యూఆర్ కోచ్ యాక్సెస్‌తోనే స్టేడియంలోకి అభిమానులను అనుమతించారు. ముందుకు ప్రకటించినట్టుగానే సాయంత్రం 4 గంటలకే స్టేడియం గేట్లు ఓపెన్ చేయడంతో ఎప్పటికప్పుడు రద్దీ లేకుండా చూసుకున్నారు. మెస్సీ జెర్సీలు ధరించిన వేలాది మంది అభిమానులతో స్టేడియం కలర్‌ఫుల్‌గా మారింది.
ఆకట్టుకున్న లేజర్ షో
మ్యూజికల్ నైట్ తర్వాత ఏర్పాటు చేసిన లేజర్ షో మరో ఆకర్షణగా నిలిచింది. మెస్సీ ఐకానిక్ ఫోటోలతో పాటు ప్రపంచకప్ గెలిచిన ఫోటోతో లేజర్ షో ఆకట్టుకుంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ ఫోటోలతో పాటు మెస్సీ జెర్సీ నెంబర్ 10, ఫుట్‌బాల్ ఆడే ఫోటోలతో లేజర్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. లేజర్ షోలో మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌లో ఆడిన కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాగే మెస్సీ జెర్సీ నెంబర్ 10, అతను ప్రపంచకప్ అందుకున్న క్షణాల ఫోటో కూడా ప్రదర్శించారు. ఇక లేజర్ షోలో మరో హైలెట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రాల ప్రదర్శన. మెస్సీ ఈవెంట్ ప్రకటన దగ్గర నుంచీ అన్నీ తానై ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్‌కు సన్నద్ధమైన సీఎం రేవంత్ ఫోటో లేజర్ షోలో ప్రదర్శించగానే స్టేడియం హోరెత్తిపోయింది.
కళ్లు మిరమిట్లు గొలిపే కాంతులతో ఆద్యంతం లేజర్ షో అందరినీ కట్టిపడేసింది. ప్రేక్షకులు తాము పెట్టిన టికెట్ ధరకు పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగే విధంగానే మ్యూజికల్ కన్సర్ట్ , లేజర్ షోలను ఏర్పాటు చేశారు. దీంతో మెస్సీ స్టేడియానికి వచ్చే లోపు అభిమానులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు.




