19 April, 2026 | 9:31 AM

మమతకు తల బొప్పి

20-08-2024 03:21 AM
  1. మరింత ముదిరిన వైద్యురాలి హత్య వివాదం
  2. ప్రభుత్వంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత
  3. కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ
  4. నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షకు కోర్టు అనుమతి
  5. కర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్‌పై ప్రశ్నల వర్షం

కోల్‌కతా, ఆగస్టు 19: కోల్‌కతాలోని ప్రభుత్వ కర్ దవాఖానలో వైద్యురాలిపై లైంగికదాడి, హత్య వ్యవహారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీటుకు ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నది. ఈ ఘటనపై మొదటి నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. దీంతో సామాన్య ప్రజల నుంచి మేధావులు, కళాకారులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు కూడా వైద్యుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ముందుకొస్తున్నారు.

మరోవైపు అధికార టీఎంసీ నేతలు బాధితురాలి కుటుంబంతోపాటు, నిరసనకారులపై నోరు పారేసుకొంటుండటంతో ప్రజాగ్రహం మరింత పెరుగుతున్నది. ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ కూడా అనేక కొత్త విషయాలను బయటకు తీస్తుండటంతో సీఎం మమతా బెనర్జీకి రాష్ట్రంలో మొదటిసారి ఉక్కపోత మొదలైంది. 

నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్

వైద్యురాలి హత్య కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. నిందితుడు సంజయ్‌రాయ్‌కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని సీబీఐ కోరటంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసును ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిని విచారించనున్నది.

ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుగా వెళ్తున్నది.  ఆర్జీ కర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సోమవారం కూడా విచారించింది. కాగా, బాధితురాలి పేరును బయటపెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దవాఖానపై మూకదాడికి పాల్పడి కేసు ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఘటననలో 37 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

మూకదాడి టీఎంసీ గూండాల పనే

మృతురాలి కుటుంబ న్యాయవాది మమతాబెనర్జీ ప్రభుత్వంపై సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన గూండాలను పెట్టి దాడులు చేయిస్తున్నదని న్యాయవాది బికేశ్ రంజన్ భట్టాచార్య ఆరోపించారు. ఆర్జీ కర్ దవాఖానపై దాడి కూడా వారి పనేనని విమర్శించారు.  

మమతపై వేలుచూపితే నరికేస్తాం 

వైద్యురాలి హత్యపై ఆందోళన చేస్తున్న తెలుపుతున్న నిరసనకారులపై మరో టీఎంసీ నేత నోరు పారేసుకొన్నారు. సోషల్‌మీడియాలో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నవారి వేళ్లు విరిచేస్తామని రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ సోమవారం హెచ్చరికలు జారీచేశారు.  

మృతురాలి శరీరంపై 14 గాయాలు

దారుణ హత్యకు గురైన వైద్యురాలి శరీరంపై 14 గాయాలున్నట్టు పోస్ట్‌మార్టంలో తేలింది. తల, ము ఖం, మెడ, చేతులు, జననాంగాలపై తీవ్ర గాయాలున్నట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. నిందితుడు మృతురాలిని గొంతు పిసికి చంపేసినట్టు గుర్తించారు. మృతురాలిపై లైంగికదాడి జరిగినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని నివేదికలో వైద్యులు తెలిపారు.

సర్కారుకు గవర్నర్ పొగ

మమతా బెనర్జీ ప్రభుత్వంతో మొదటి నుంచీ పోరాటం చేస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ డాక్టర్ హత్య కేసును మరింత మంచి అవకాశంగా మార్చుకున్నారు. నిరసనకారులను కలిసి మద్దతు ప్రకటించిన ఆయన.. తాజాగా రాష్ట్రంలోని పలు రంగాల ప్రముఖులతో ఈ అంశంపై సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రజల నిరసన తీవ్ర స్థాయికి చేరిందని, దీంతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించటం గమనార్హం. మరోవైపు మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఐఎం డిమాండ్ చేశాయి.