19 April, 2026 | 11:22 AM

చోర కళ.. నేర్పిస్తే పోలా!

21-08-2024 03:18 AM
  1. దొంగతనాలకు ట్రైనింగ్ 
  2. మధ్యప్రదేశ్‌లో ఫుల్ ఫేమస్ అయిన విలేజ్ 
  3. పోలీసులకు చాలెంజ్ విసురుతున్న ముఠాలు

భోపాల్, ఆగస్టు 20: చిన్న పిల్లలను ఏదైనా కళ (చదువు) నేర్చుకోమని స్కూల్‌కు పంపడం చూసుంటాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఏకంగా చోరకళ (దొంగతనాలు) నేర్పుతున్నారు. 12 సంవత్సరాల వయసున్న తమ పిల్లలను తల్లిదండ్రులే ఇక్కడి క్రిమినల్ గ్యాంగుల వద్ద శిక్షణ కోసం వదిలేసి వెళ్తుండడం గమనార్హం. శిక్షణ కోసం క్రిమినల్ గ్యాంగ్స్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 లక్షల ఫీజును కూడా వసూలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కడియా, గుల్‌ఖేడీ, హుల్‌ఖేడీ గ్రామాలు ఈ విద్యకు పేరుగాంచాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 117 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలు ఉండడం గమనార్హం. పోలీసులు కూడా ఈ గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తీవ్రతకు అద్దం పడుతోంది. 

2 లక్షలు కట్టు.. 5 లక్షలు పట్టు

12 సంవత్సరాల పిల్లల్ని స్వయానా తల్లిదండ్రులే ఇక్కడి క్రిమినల్ గ్యాంగుల వద్ద వదిలేసి వెళ్తున్నారు. ఏదో నామ్ కే వాస్తేగా కాకుండా రూ. 2 లక్షల ఫీజు కట్టి మరీ తమ పిల్లలను క్రిమినల్ గ్యాంగుల వద్ద దొంగతనాల్లో ఆరితేరమని వదిలేస్తున్నారు. ఇలా వదిలేసిన పిల్లలకు సదరు క్రిమినల్ గ్యాంగ్స్ ఏడాది పాటు శిక్షణను ఇస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో జేబు దొంగతనాలు, రాబరీలు, లూటీలు ఎలా చేయాలో కూలంకుషంగా నేర్పుతున్నాయి. ఈ ట్రైనింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత సదరు క్రిమినల్ గ్యాంగులే పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 3 లక్షల వరకు చెల్లిస్తూ గ్యాంగుల్లో చేర్చుకుంటున్నాయి. 

8 వేల కేసులు 

దొంగతనాలు మనకు చూసేందుకు చాలా చిన్నవిగా అనిపించినా కానీ చాలా పెద్దవి. ఈ మూడు గ్రామాల పరిధిలోని దొం గల మీద గ్యాంగుల మీద దేశవ్యాప్తం గా ఉన్న పోలీస్ స్టేషన్లలో సుమా రు గా 8,000 కేసులు నమోదయ్యాంటేనే ఇది ఎంత పెద్ద నెట్‌వర్కో, వీరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.