1 September, 2026 | 3:13 AM

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

01-09-2026 02:17 AM

రెండు రోజులు హస్తినలోనే.. 

పార్టీ అధిష్ఠానం పెద్దలతో భేటీ కానున్న సీఎం 

డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ కూడా ముఖ్యమంత్రి వెంట

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండి పార్టీ అధిష్ఠానం పెద్దలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. ఒకటో తేదీన అక్కడే ఉండి 2న ఢిల్లీలో జరిగే వైఎస్ అవార్డు ప్రదానోత్సవంలోనూ పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా హాజరుకానున్నారు. తుమ్మడిహట్టి ఎత్తు అంశంపై మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న మీటింగ్‌లోనూ సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంగళ, బుధవారాల్లో కాంగ్రెస్ హైకమాండ్‌తో కీలక చర్చలు జరిగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రివరకు ఢిల్లీ చేరు కుంటారని తెలుస్తోంది. ఆయన వచ్చిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సమవేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ౭న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి ముందు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని నేతలు చెబుతున్నారు.