9 August, 2026 | 12:39 AM

ఔషధ మొక్కలతో వైద్యం భేష్

20-06-2024 02:35 AM
  • బయోసిన్మెడికాపై సమీక్షలో మంత్రి దామోదర

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : మెడిసినల్ ప్లాంట్స్‌తో వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యానవనం చక్కటి ఆలోచన అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు కృషిని మంత్రి ప్రశంసించారు. తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ శాఖల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్‌లో బయోసిన్మెడికా పేరుతో ఉద్యానవనం అభివృద్ధిపై బుధవారం సచివా లయంలో సమీక్ష నిర్వహించారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేకమైన లివింగ్ పార్క్‌గా బయోసిన్మెడికాను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

1200 కంటే ఎక్కువ ఔషధ జాతుల మొక్కలు ఉన్నట్లు పేర్కొన్నారు.  సప్త చక్రాల పురాతన జ్ఞానం లేదా మానవ శరీరంలోని 7 శక్తి కేంద్రాలతో ఔషధ మొక్కలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యోగా సెంటర్, మెడిటేషన్ ఏరియా, యాంఫీథియేటర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు  మంత్రికి చెప్పారు. కృత్రిమంగా రెండు చెరువులను ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంతో పాటు పక్షులకు ఆవాసాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చౌంగ్తు, సంయుక్త కార్యదర్శి వినయ్‌కృష్ణారెడ్డి, సోని బాలాదేవి, తెలంగాణ ఔషధ మొక్కల బోర్డు సీఈవో, అటవీశాఖ అధికారులు, ఔషధ మొక్కల బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యవిద్య కోసం టాస్క్‌ఫోర్స్ 

తెలంగాణలో నాణ్యమైన వైద్య విద్యను అందించేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ర్టంలో ఉన్న ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల యాజమాన్యం, డీన్ లు, ప్రిన్సిపాళ్లతో బుధవారం  జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభు త్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాల ల తో పాటు డెంటల్ కాలేజ్ లలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కళాశాలల నుంచి నాణ్యమైన వైద్యులు బయటకు వస్తేనే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందు తాయన్నారు. అధికారులు సైతం క్రమం తప్పకుండా వైద్య కళాశాల పనితీరును సమీక్షించాలని ఆయన కోరారు.