యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి
- ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్
- నెలకు రూ.11,500 వరకు ఉపకార వేతనం
- త్వరలో అందుబాటులోకి ‘టాటా’ టెక్నాలజీ సెంటర్లు
- రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హుజూర్‌నగర్‌లో ఐటీఐ కళాశాల భవనానికి శంకుస్థాపన
సూర్యాపేట, జూన్ 19: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలో రామస్వామి గట్టు వద్ద రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీఐ కళాశాల భవన పనులకు బుధ వారం ఆయన ఎంపీ రఘువీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభు త్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఉద్యో గాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం యువత గురించి పట్టించుకుంటున్నదన్నారు. దీనిలో భాగంగానే కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు.
ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ కల్పించేందుకు ప్రతి నెలా రెండో సోమవారం ప్రభుత్వ ఐటీఐలో మేళా లు నిర్వహిస్తామన్నారు. శిక్షణలో వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.11,500 వరకు ఉపకార వేతనం అందిస్తామన్నారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను యువతకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రూ.2,324 కోట్లతో ఐటీఐలను ఆధునీకరిస్తామన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూ.126 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.
దీనిలో భాగంగానే రూ.20 కోట్లతో దొండపాడు డబుల్ రోడ్డు నిర్మాణం, విస్తరణ పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లింగగిరిలో రూ.20 కోట్లతో హుజూర్‌నగర్ యాతవాకిళ్ల డబుల్ రోడ్డు, చిల్లేపల్లిలో రూ.20 కోట్లతో చిల్లేపల్లి సోమారం డబుల్‌రోడ్డు, చిలుకూరులో రూ.16 కోట్లతో చిలుకూరు జె ర్రిపోతులగూడెం డబుల్ రోడ్డు, గణపవరంలో రూ.10 కోట్లతో కీతవారిగూడెం మునగాల వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ ప్రియాంక, ఉపాధి కల్పనశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజు పాల్గొన్నారు.






