బోడుప్పల్ సర్కిల్ లో ఆరోగ్య శిబిరాలు
ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించిన హెల్త్ అధికారులు
మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 35వ రోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్, బోడుప్పల్ కార్యాలయం, కమల హాస్పిటల్ ప్రాంగణాల యందు ఆరోగ్య శిబిరాలను కేకేశ్వర హాస్పిటల్, యు పి హెచ్ సి బోడుప్పల్, కమల హాస్పిటల్ పీర్జాదిగూడ డాక్టర్ల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని బోడుప్పల్ సర్కిల్ ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపులను ఏ ఎం ఓ హెచ్ పర్యవేక్షించి ప్రజలకు తమ విలువైన సలహాలు, సూచనలు అందించారు.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలందరూ రానున్న మాన్సూన్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోడ్లపై చెత్తను వేయకుండా స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అందించాలని కోరారు. నగరపాలక సంస్థ తరఫున షెడ్యూల్ ప్రకారం చెరువుల్లో ఆయిల్ బాల్స్ చేయడం, మలాథిన్ ఆయిల్ స్ప్రే చేయించడం, ఇంటింటికి దోమల నివారణ మందులు పిచికారి చేయించడం, ప్రతిరోజు ఫాగింగ్ చేయించడం వంటి కార్యక్రమాలు నిరంతరం చేపడతామన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అనంతరం హెల్త్ క్యాంపులకు హాజరైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్ తోపాటు డి ఈ జాహ్నవి శశాంక, ఏఈ మహేష్, ఎస్సై ప్రవీణ్ కుమార్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




