calender_icon.png 7 June, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం మన చేతుల్లోనే!

31-05-2025 12:00:00 AM

ఏ అలవాటైనా తొలుత ఆకర్షణీయంగానే ఉంటుంది. మానసికోల్లాసానికో, అవాంఛనీయ ఉద్రిక్తతల ను తగ్గించుకోవడానికో, ఆధునిక సమాజంలో స్టేటస్ సింబ ల్‌గానో లేదా మరో కారణంతోనో పొగతాగడానికి అలవా టు పడిపోయే వాళ్లు ఎందరో. తర్వాత ఆ అలవాటును మా నుకోలేక ఆరోగ్యాన్ని బలివ్వవలసిన పరిస్థితి ఎదురవుతుంది. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను నివారించడమే లక్ష్యంగా 1988 నుంచి ప్రతీ ఏడాది మే 31న అంతర్జాతీయంగా ‘వరల్డ్ నోదూ డే’ (పొగాకు వ్యతిరేక దినం)ను నిర్వహిస్తున్నాం.

ఈ ఏడాది ‘బ్రైట్ ప్రాడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్’ (ఆకర్షణీయ ఉత్పత్తులు  అంధకార పరిస్థితులు) ఇతివృత్తంగా నిర్ణయించారు. ప్రధానంగా పొగాకు పరిశ్రమ వినియోగదారులను ఏ రకంగా ఆకట్టుకుంటుందో ప్రజలకు అవగాహన కలించే రీతిలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు పిలుపునిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించేలా, రంగురంగుల పొగాకు రుచులతో కూడిన ఆకర్షణీయ ఉత్పత్తుల బారిన వారు పడకుండా ఉండడానికి అవలంబించవలసిన వ్యూహాలను విశదీకరించాల్సి ఉంది. పొగాకు వాడకం ప్రపంచ వ్యాప్తంగా నివారించ దగిన మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 15 ఏళ్ల వయస్సులో ఉన్న 3.7 కోట్లమంది పిల్లలు పొగాకు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దీన్నిబట్టి పరిస్థితి తీవ్రత అర్థమవుతున్నది. కొత్త నికోటిన్ ఉత్పత్తులు, ముఖ్యంగా ఈ- హీటెడ్ పొగాకు ఉత్పత్తులు మహిళలు, యువతలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. ఇవి ఆకర్షణీయమైన రుచులు, రంగులతో ఉండటం వల్ల వాటికి బాగా అలవాటు పడే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. ప్రపంచంలో 16,000కి పైగా వివిధ రకాల ఈబూ రుచులు అందుబాటులో ఉండటం, కొన్ని దేశాల్లో వీటిని వాడే వారిలో 90 శాతం మంది యువతనే లక్ష్యంగా చేసుకోవడం విషాదకరం.

అయితే, పురుషులు, మహిళల మధ్య పొగాకు వాడకంలో తేడా తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు ఆధునిక మహిళలు, అమ్మాయిలలో పొగ తీసుకోవడం పెరుగుతోంది. చాలామంది పొగాకు వినియోగదారులకు మనసులో ఈ అలవాటును మానాలని ఉన్నా మానలేకపోతారు. కారణం, ఆ మేరకు గట్టి చిత్తశుద్ధి లోపించడమే. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వచ్చే పన్నుల రాబడికి అలవాటు పడుతుండడం దురదృష్టకరం.

దీనివల్ల సర్వికల్ కాన్సర్, అస్థిమేజ్డ్ (ఒప్టియోపోరోసిస్), ఫర్టిలిటీ లోపాలు వంటి ఆరోగ్య సమస్యలు అనేకం తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాక, పలు ప్రాంతాలలో మగపిల్లలలో పొగతాగే రేటు అత్యధికంగా ఉండటం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు, సమాజం కలసి పొగాకు ఉత్పత్తులపై నిషేధాలు, నియంత్రణలు పెట్టాలి.

హెచ్చరికలు ఏదో లాంఛనంగా కాకుండా మరింత బలంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. పన్నులను మరింత పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి.  పొగాకు రహిత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ముందడుగు వేయాలి. అప్పుడే మరింత ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.

 డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ