పన్నుల వాటా పెంచండి
కేంద్ర పథకాల్లో రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వాలి
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి
రాష్ట్రానికి మరిన్ని నవోదయ స్కూళ్లు కేటాయించాలి
పునర్విభజన చట్టం కింది బకాయిలు వెంటనే ఇవ్వండి
పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌ఛార్జీలు 10 శాతం మించొద్దు
ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్టీని తొలగించండి
బడ్జెట్ సన్నాహక భేటీలో కేంద్రానికి భట్టి కీలక సూచనలు
బొగ్గు వేలంపై బీఆర్‌ఎస్ మొసలి కన్నీరంటూ మండిపాటు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్)కు సంబంధించి ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూలధన వ్యయాన్ని పెంచే ఆర్థికసాయం పథకానికి వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులను రూ.2.5 లక్షల కోట్లకు పెంచాలని కోరారు. అంతర్గతంగా నిధులను సమకూర్చుకొని తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు.
బొగ్గు వేలంపై బీఆర్‌ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వల్లే 2015లో బొగ్గు చట్టం మారిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఇల్లెందు, సత్తుపల్లి గనులు ప్రైవేటు సంస్థలకు అప్పగించారని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంతో పాటు 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఆ వివరాలను ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి వెల్లడించారు. సీఎస్‌ఎస్‌ను సమీక్షించి అనవసర పథకాలను తొలగించి, కొత్త పథకాలను చేర్చేలా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి కొత్త పథకాలను తీసురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వాటిని ఆధునీకరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
భట్టి సూచించిన కొన్ని అంశాలు..
- * జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ విలువైన భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటోంది. సీఎస్‌ఎస్ కింద విడుదలయ్యే నిధుల తగ్గడం ఒకటైతే.. కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం మరో విఘాతంగా మారింది. అందుకే సీఎస్‌ఎస్ నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. 2023 సీఎస్‌ఎస్ కింద విడుదల చేసిన మొత్తం రూ.4,60,000 కోట్లలో తెలంగాణకు రూ.6,577 కోట్లు మాత్రమే దక్కాయి. జనాభా దామాషా ప్రకారం ఇది చాలా తక్కువ. అందువల్ల సీఎస్‌ఎస్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి.
- * ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు పన్ను విభజనలో వాటా తగ్గింది. మొత్తం పన్ను ఆదాయానికి సెస్‌లు, సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా చర్యలు తీసుకోవాలి.
- * బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని తెలియజేయాలి.
- * ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 94 (2) కింద, రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్రం తెలంగాణకు రూ.2,250 కోట్లు బాకీ ఉన్నది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి.
- * తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది రాష్ట్రానికి మంజూరైన రూ.495.21 కోట్ల సీఎస్‌ఎస్ గ్రాంట్లను కేంద్రం పొరపాటున ఏపీకి విడుదల చేసింది. ఆ నిధులను తెలంగాణకు మళ్లించాలి.
- * ఉపాధి హామీ కింద విడుదలైన నిధులను ఉపాధి కోసమే వినియోగించిన వారికి..ఈ పథకంలో పరిమితులను నుంచి మినహాయింపు ఇవ్వాలి.
- * తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించిన నేపథ్యంలో.. ఈ గ్రాంటును వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొడిగించాలి.
- * పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
- * హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి నిధులివ్వాలి
- * మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి
- * రీజినల్ రింగ్ రోడ్ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి సహకరించాలి
- * తెలంగాణకు మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి
- * ప్రధాని సూర్యఘర్ విద్యుత్ సబ్సిడీ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద రాష్ట్రానికి సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడి భారం తగ్గుతుంది.
- * ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్టీని మినహాయించాలి.
- * అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ)ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి. ఈఎన్‌ఏను జీఎస్టీ కింద చేర్చడం వల్ల రాష్ట్రాల ఆర్థిక సౌలభ్యం తగ్గుతుంది.






