ఆరోగ్యకరమైన జననాలేలక్ష్యం
- ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం కీలకం
- గర్భిణి నుంచి పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు బాలామృతం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ
- నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం
- పాల్గొన్న మంత్రి ధనసరి సీతక్క
హైదరాబాద్/ఉప్పల్, జూలై 7 (విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మా ణానికి పౌషకాహారమే కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతమైన తెలంగాణ కల సాకారమవుతుందని, అందుకోసం గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ప్రజాప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్స్ బాలామృతం ప్లాంట్‌ను మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. గర్భిణుల కోసం అప్పట్లో ఇందిరాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాలో బాలామృతం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు.
ఇప్పుడు పరిశ్రమగా ఎదిగి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా బాలామృతానిన సరఫరా చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. మహిళలు గృహ నిర్వహణకే పరిమితం కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యమని తెలిపారు. నేడు మహిళలు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారని.. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ నుంచి మంత్రి సీతక్క నిరూపించారని పేర్కొన్నారు.
ఓటు బ్యాంకు పథకాలు కావు
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం పోషకాహార భోజనం ఉచితంగా అందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పథకాల అమలుకు విద్యాశాఖపై ప్రతి ఏడాది రూ.27 వేల కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, ఇది మేం ఖర్చుగా భావించడంలేదన్నారు. ఇవి ఓటు బ్యాంకు పథకాలు కాదని, విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరునే కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో పేదల కోసం ప్రత్యేకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రంలోని 3.28 కోట్ల లక్షల మందికి రేషన్ దుకాణాల ద్వారా ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు తనను ఎంపీగా గెలిపించిన విషయాన్ని గుర్తుచేసుకున్న సీఎం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉప్పల్ అభివృద్ధి బాధ్యతలను స్వయంగా తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
50 ఏళ్ల క్రితమే టీజీ ఫుడ్స్ : సీతక్క
తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు 50 ఏళ్ల క్రితమే బీజం పడిందని, టీజీ ఫుడ్స్ పేరుతో ప్రారంభం అయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని బాలామృతం ప్లస్‌ను కూడా అందజేస్తున్నామని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకారలోప నివారణకు సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి వెల్లడించారు. నాచారం తరహా బాలామృతం ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదన్నారు. టీజీ ఫుడ్స్ బలోపేతానికి కృషి చేస్తున్న చైర్మన్ ఫహీమ్‌కు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
సీఎంకు ఉప్పల్ ఎమ్మెల్యే వినతి
ఉప్పల్ నియోజవర్గంలోని నాచారం పారిశ్రామిక వాడలో తెలంగాణ ఫుడ్స్ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవాని కి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రామాంతపూర్ ప్రత్యేక పోలీస్‌స్టేషన్, చిన్న చెరువు, పటేల్ కుంట అభివృద్ధి చేయాలని విన్నవించారు. అలాగే స్థలం కేటాయించి డిగ్రీ కాలేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.






