8 July, 2026 | 2:00 AM

పాలనపై పట్టులేని రేవంత్

08-07-2026 01:16 AM
  1. సీఎం చూస్తున్న శాఖలు అస్తవ్యస్తం 
  2. రాష్ట్రంలో అభివృద్ధి జాడలు మచ్చుకైనా లేవు 
  3. పదవిని  కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి ఆరాటం 
  4. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాల న వైఫల్యాలతోనే సాగిందని, పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీస పట్టు సాధించలేకపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. సీఎం స్వయంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్య, హోం, మున్సిపల్ శాఖలు  అస్తవ్యస్తంగా మారాయని, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలు, సంక్షేమాన్ని విస్మరించారని..  ఎంతసేపు  హైకమాండ్ మెప్పుకోసం, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తన పదవిని కాపాడుకునేందుకే ఆరాట పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, తరచూ జరుగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలే అందుకు నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నారు.

30 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 24సార్లు ఉన్నతస్థాయిలో బదిలీలు జరగడం దారుణమన్నారు. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పెద్ద జిల్లాల కలెక్టర్లను ఒకటి కంటే ఎక్కువసార్లు బదిలీ చేశారంటే, ప్రభుత్వానికి అధికారులపై నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. దీనివల్ల  యంత్రాంగం పాలనా వ్యవహారాలపై దృష్టి సారించలేక పోతుందన్నారు.

పాలన.. సచివాలయం నుంచా? ఢిల్లీ నుంచా?

ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం చాలా అరుదుగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. రెండున్నర ఏళ్లలో 71 దఫాలు ఢిల్లీ పర్యటనలు చేయడం చూస్తుంటే  పాలన.. సచివాలయం నుంచా? ఢిల్లీ నుంచా? లేదా దారుస్సలాం నుంచి జరుగుతుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఎద్దేవా చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసగించారని దుయ్యబట్టారు.

రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించాయని, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందన్నారు. హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు పెద్దఎత్తున చొరబడి దొంగ ఓట్లు పొందితే, వారికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం దుర్మార్గమన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కేవలం ముస్లిం ఓట్ల కోసం మజ్లిస్‌కు వంతపాడుతూ దొంగ ఓట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మజ్లిస్ ప్రేరణతో కాంగ్రెస్ కుట్రలు చేసి హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసిందన్నారు. ఈ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుని ప్రజా స్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందన్నారు.