calender_icon.png 16 October, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

16-10-2025 02:26:07 AM

-హైకోర్టు ఇచ్చిన స్టేపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

-ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీసీ సంఘాల నేతలు, ప్రధాన రాజకీయ పార్టీలు

హైదరాబాద్, అక్టోబర్ 15(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేసింది.

దీని పై గురువారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. పిటిషన్ విచారణకు స్వీకరించాలో లేదో ఖరారు చేయనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రి య, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరి కాదని వాదించనుంది.

సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరి మితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. కాగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ప్రజలతో పాటు బీసీ సంఘాల నేతలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.