పసిపాప మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలి
కొల్లాపూర్ టౌన్: కుమ్మెర జాతరలో(Kummera Jatara incident) జరిగిన ఘటనలో పసిపాప మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పసిపాప మృతికి కారణమైన 8 మంది నిందితుల్లో కేవలం ముగ్గురినే పోలీసులు అరెస్టు చేయగా, మిగతా నలుగురు పరారీలో ఉన్నారని ఆరోపించారు. వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు జగ్జీవన్ రావు, బోరెల్లి సంగమయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు పుట్టపాక రాము, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు మంద నరసింహ, మేకల రాముడు, కలమంద శేఖర్, బీఎస్పీ జిల్లా కోశాధికారి బి.దాస్, దళిత దండు నాయకులు మల్లెల వెంకటస్వామి, కోళ్ల బాలస్వామి, చాకలి రవి, గౌడ సంఘం నాయకులు కృష్ణయ్య గౌడ్, చందన్ గౌడ్, సుదర్శన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, బంకల మూర్తి, కేశపాక మహేష్, ఎమ్మార్పీఎస్ నాయకుడు శీలం కురుమయ్య, శీలం వెంకటేష్, పసుపుల కురుమయ్య, పగిడాల బాలకృష్ణ, బీసీ నాయకులు చంద్రయ్య, ఆది వసంత కుమార్, సురేష్, జిలకర కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని, నిందితుల అరెస్టులో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.




