27 February, 2026 | 2:13 PM

లాటరీలో పేరు కే పరిమితమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

27-02-2026 12:36 PM

కార్యాలయల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు.

చెప్పులు అరిగేదక తిరిగిన అర్హులకు పత్రాలు అందవు.

చేతులు దులుపుకున్న అధికారులు ఆందోళనలో జనాలు.

భిక్కనూర్,(విజయక్రాంతి):  భిక్కనూర్ మండల(Bhiknoor Mandal) కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు(Double bedroom houses) నేటికీ లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలాయి. గత ప్రభుత్వం పేదల గృహావసరాల కోసం మండల కేంద్రంలో 50 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించగా, కనీస వసతులు లేకపోవడంతో అవి ఉపయోగానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించి ఇళ్లు సిద్ధం చేసింది. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించిన అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదు నెలల క్రితం తహసీల్దార్ సునీత ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.

లాటరీలో పేరు రావడంతో పేద కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆనందం క్షణకాలమే అయ్యింది. ఇప్పటివరకు ఒక్కరికి కూడా కేటాయింపు పత్రాలు అందలేదు. ఇళ్ల తాళాలు లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లకపోవడంతో, కొన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఇతర వ్యక్తులు నివాసం ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో లాటరీలో ఎంపికైన కుటుంబాలు గ్రామ సచివాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పత్రాలు లేకుండా నెలల తరబడి ఎదురుచూస్తున్న పేదల ఆశలు నేడు నిరాశగా మారాయి. నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లాటరీలో ఎంపికైన లబ్ధిదారులకు తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.