06-10-2025 12:32:01 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 5 (విజయక్రాంతి): ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోతవానకు నగరంలోని పలు ప్రధాన రహ దారులు జలమయమయ్యాయి.
నగరంలో ని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్‌గూడ వంటి కీలక ప్రాంతాలతో పాటు కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాం పల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లలో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి , పరిసర ప్రాంతా ల్లోనూ వాన దంచికొట్టింది.
గంటకు పైగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై, లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డిలో
కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం వాన దంచి కొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు కాలనీలు అయ్యప్ప నగర్, గాంధీనగర్, నిజాంసాగర్ రోడ్డు, స్టేషన్ రోడ్, జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, రాజనగర్ కాలనీ, దేవి విహార్ కాలనీలను అధికారులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. గత నెల రోజుల క్రితం ఆతలాకుతలమైన జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆధ్వర్యంలో పరిశీలించి అలర్ట్ చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలను అప్రమత్తం చేసి బాధితులకు నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ ఆదేశించారు.
కామారెడ్డి పెద్ద చెరువు భారీ వర్షానికి అలుగులు దూకుతున్నాయి. చెరువులో గంగ పుత్రులు చేపలు పట్టకుండా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి పై ఉన్న రాజంపేట, తాడువాయి మండలాల్లో భారీ వర్షం కురవడంతో కామారెడ్డి పెద్ద చెరువు లోకి భారీ వరద నీరు చేరుతుండటంతో జి ఆర్ కాలనీ సమీపంలోని పెద్దవాగు ప్రవా హం పెరుగుతుండటంతో అధికారులు కాలనీవాసులను అప్రమత్తం చేశారు. అలాగే జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, రాజంపేట, బిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
పిడుగుపాటుకు మహిళ మృతి
కాటారం(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి(48) కూలీ పనుల్లో భాగంగా పత్తి చేనుకు వెళ్లింది. చేనులో ఉండగానే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కురిసిన వర్షంతో పాటు పిడుగు పడటంతో లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది.