06-10-2025 01:17:48 AM
మెజార్టీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహం
జూబ్లీహిల్స్‌ను జారవిడుచుకోవద్దని నిర్ణయం
అభ్యర్థుల ఎంపికపై పదాధికారుల సమావేశంలో చర్చ
కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తిచూపాలన్న పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ విజ యం సాధించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోం ది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ చేప ట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధా నంగా చర్చించారు.
పార్టీ విజయం కోసం సమష్టి కృషి చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రత్యేకంగా గత బీఆర్‌ఎస్ సర్కారు హయాం లో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలను, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, మోసాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేయాలని తీర్మానించారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో గత 22 నెలలుగా కాంగ్రెస్ సర్కారు చేసిన కు ట్రలు, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రా మీణ పాలనను నిర్వీర్యం చేసిన విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని తీర్మానించారు. ఎప్పటికప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఆఫీస్ బేరర్స్ సూచనలు సేకరించి దానికి అనుగుణంగా వ్యూహాలను పదునుపెట్టుకోవాలని సమావేశంలో చర్చించారు. పాత, కొత్త నాయకులు అనే భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి శ్రేణులను ప్రోత్సహిచేలా కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు.
జెడ్పీటీసీ ఇన్‌చార్జ్‌లుగా, జిల్లా ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని..
అదేవిధంగా ఈ సమావేశంలో మాజీ పార్లమెంట్, అసెంబ్లీ, శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ర్ట పదాధికారులు, మాజీ పదాధికారులు ప్రతి ఒక్కరినీ జెడ్పీటీసీ ఇన్‌చార్జ్‌లుగా, జిల్లా ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని నిర్ణయించారు. రాష్ర్టంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారం సాధించేలా ఎన్నికల సన్నాహక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఎక్కువ శాతం జెడ్పీటీసీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహా లు రూపొందించినట్లు తెలిసింది.
8న మరోసారి భేటీ..
ఈనెల 8న మరోసారి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీజేపీ ముఖ్య నాయ కులు నిర్ణయించారు. ఆరోజు కీలక నేతలందరితో చర్చించి ఎన్నికలకు పూర్తి స్థాయిలో స మాయత్తం కానున్నారు. నియోజకవర్గ స్థాయి లో అభ్యర్థుల ఎంపిక, కమిటీలు ఏర్పాట్లపై ఆ యా నేతల నుంచి ఈ సమావేశంలో సూచనలు తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కమిటీలను ప్రకటించనున్నారు.
ఉప ఎన్నిక కోసం స్పెషల్ కమిటీ..
అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా బీజేపీ గురిపెట్టింది. నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రత్యేక ఎజెండాను రూపకల్పన చేస్తోంది. ఈ ఎన్నికలో నగ రంలోని నాయకులందరికీ బాధ్యతలను అప్పగించనుంది. ఉప ఎన్నిక కోసం ప్రత్యేక కమి టీని ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక, అభిప్రాయ సేకరణ చేపట్టి ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించనున్నారు.
మోదీ అభివృద్ధిని ప్రజలకు వివరించాలి : రాంచందర్‌రావు
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద ర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాలకు మళ్లించుకుంటుందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనూ కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
రాష్ట్రంలో నిధులు లేక కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. శ్మశాన వాటికలు, వనమహోత్సవం, సడక్ యోజన రోడ్లకు కేంద్రం నిధులు అందించిందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ తెలంగాణ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరించాలని సూచించారు.
సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ, శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నాయకులు ఏ.వి.ఎన్. రెడ్డి, పార్టీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ర్ట పదాధికారులు, ప్రధానకా ర్యదర్శులు పాల్గొన్నారు.