06-10-2025 01:24:01 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత
-రిజర్వేషన్ల 50% పరిమితి మించడంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో పిటిషన్లు
-నేడు సుప్రీం కోర్టులో విచారణ హైకోర్టులో ఈ నెల 8న..
-న్యాయస్థానాలిచ్చే తీర్పులపై బీసీ వర్గాల్లో తీవ్రమైన చర్చ
-ప్రతికూలమైన తీర్పులు వస్తే ప్లాన్ మార్చనున్న రాష్ట్ర ప్రభుత్వం?
-సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం
-బీసీ కోటాపై ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ప్రణాళికలు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల సందడి కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల గురించే ప్రధాన చర్చ జరిగింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో ఆశావహులు తమ పార్టీ పెద్దలను కలిసి, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో సైతం పడ్డారు.
కానీ, ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పరిమితి 50శాతం మించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, న్యాయస్థానం విచారణను ఈ నెల 8కి వాయిదా వేయడం జరిగిపోయింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఇది మరువకముందే తాజాగా కోటా పరి మితిపై మరో వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపై ఇప్పుడు బీసీలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే చర్చ రాష్ట్రమంతటా జరుగుతున్నది.
హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి అమలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోటా 50 శాతం మించడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంటున్నారు. పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారించనున్నది. మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 8న తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనున్నది. దీంతో బీసీ కోటాకు సంబంధించిన జీవో నంబర్ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నా యి? జీవో అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
న్యాయస్థానాల తీర్పే కీలకం..
బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన 0-9కి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు 22 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తుందా, లేదా నిలిపివేస్తుందా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.
ఈ తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం తేలనున్నది. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయ స్థానాల్లో తీర్పు వ్యతిరేకంగా వచ్చి నా చట్టపరమైన పరిమితుల్లోనే బీసీలకు కనీసం 22 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూ, మరో 20 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ఒకవైపు చట్టాలకు లోబడి నిర్ణయం తీసుకోవడంతోపాటు బీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయస్థానాల నుంచి తీర్పు ఎలా వచ్చినా స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తగిన ఏర్పాట్లు ప్రారంభించింది. న్యాయస్థానాల నుంచి వెలువడే ఆదేశాల ప్రకారమే ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు నిర్ధారణ కానున్నాయి. ఈనెల 8న హైకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత, రాష్ట్రప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. అనే అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
పరిష్కారం దిశగా కొత్త ప్రణాళిక..
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను బట్టి కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమతున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలైతే.. కోటా పరిమితి 50 శాతానికి మించు తుంది. కోటాపై న్యాయస్థానాల నుంచి ప్రతికూలత వస్తే.. ఏం చేయాలనే అంశంపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
కోర్టుల తీర్పు మేరకు బీసీ, అన్- రిజర్వ్‌డ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం -ఉందనే అభిప్రాయ మూ కొన్నివర్గా నుంచి వ్యక్తమవుతున్నది. మరోవైపు కోటా బిల్లుపై గవర్నర్ నిర్ణయం కోసమూ సర్కార్ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో 25 రోజులైతే అసెంబ్లీ ఆ బిల్లును గవర్నర్ వద్దకు పంపించి 90 రోజులు అవుతుంది.
గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ కేసు నడుస్తున్నది. గత వాయిదాల్లో 90 రోజుల పరిమితి దాటితే, గవర్నర్ ఆమోదించకున్నా, బిల్లులు ఆమోదమవుతాయనే ప్రతిపాదన సైతం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు, రా ష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతిపక్షాల వ్యూహాలు..
42శాతం బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు, న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడం బీసీల్లో గందరగోళానికి గురిచేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది. న్యాయస్థానాల నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, కోటాపై ఎలాంటి స్పందిస్తాయోనని బీసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ దశాబ్దాల కల నెరవేరుతుందా, లేదా పాత రిజర్వేషన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల అంశంతో బీసీల్లో ఒకవైపు ఉత్కంఠ నెలకొనగా, ప్రతిపక్షాలు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని, న్యాయ పరమైన చిక్కుల పేరిట బీసీలను మభ్య పెట్టి హామీల అమలును దాటవేయాలని చూస్తున్నట్టు ఇప్పటికే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బీసీల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది.
ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తీసుకొస్తే, చట్టపరమైన రిజర్వేషనే కేటాయించాలని బీసీలతో కలిసి పట్టుబట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది. మరోవైపు బీజేపీ కూడా రిజర్వేషన్ అమలు సాధ్యం కాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, శాస్త్రీయంగా కులగణన, బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపణలను తీవ్రతరం చేస్తున్నది.