06-10-2025 01:21:09 AM
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో వేర్వేరుగా మంత్రుల సమావేశం
తాజా పరిణామాలపై వివరణ
నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న పిటిషన్
బలమైన వాదనలు వినిపించేందుకు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు
సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకోనున్న నేతలు
బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని మంత్రి పొన్నం అభ్యర్థన
హైదారబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజలతోపాటు, ప్రభుత్వ వర్గాల్లో నూ నెలకొంది. సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు రాబోతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రు లు, పీసీసీ అధ్యక్షుడు వేర్వేరుగా సమావేశమయ్యారు. రిజర్వేషన్ల అమలుపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై లోతు గా చర్చించినట్లు తెలిసింది.
తొలుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో తాజాగా జరుగుతున్న పరిణామా లపై సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్‌లకు మంత్రి పొన్నం వివరించారు. ఈ అంశంపై ఏం చేయాలో...ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.
మీనాక్షి నటరాజన్‌తో డిప్యూటీ సీఎం, మంత్రులు భేటీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోనూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వెళ్లిన అంశాలను ఆమెకు వివరించారు. స్థానిక సంస్థ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించి నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా గ్రామాల్లో ఓట్ చోరీ సంతకాల సేకరణ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ విచారణలో ఉంది. ఇది ఈనెల 8న విచారణకు రానుంది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో రిజర్వేషన్ల అంశంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరు సమావేశాల్లో చర్చించినట్లు తెలుస్తోంది.
హస్తినకు మంత్రులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై న్యాయ కోవిదులతో సలహాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కూడా పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి సూచన మేరకే తామంతా ఢిల్లీకి వెళ్తున్నామని, అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని, పిటిషనర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, ఇది ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం కలిగించేది కాదని తెలిపారు.
కొంత మంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నారని, బలహీన వర్గాలకు అందరూ మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న హక్కు మాదిరిగానే బీసీలకూ హక్కు ఉండాలని చేస్తున్న ప్రయత్నమిదని వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు న్యాయ స్థానాల్లో రాజకీయ పార్టీల మద్దతే ప్రజల మద్దతు అని చెప్పాలని కోరారు.