calender_icon.png 14 June, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భారీ వర్షం

14-06-2025 01:13:42 AM

  1. లోతట్టు ప్రాంతాలు జలమయం

ట్రాఫిక్ జాంతో ఇబ్బందులుపడ్డ ప్రజలు

ఆదిలాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు

రాబోయే 5 రోజులూ వర్షాలే

హైదరాబాద్ సిటీ బ్యూరో/ఆదిలాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కుండపోత వాన కురిసింది. నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషామహాల్, చార్మినార్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తోడుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. బేల మండలం టాక్లి సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో  వాగుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 

రాబోయే 5 రోజుల పాటు వర్షాలే

రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 14న నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 15న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి,

మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, 16న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, 17న కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, 18న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.