11-09-2025 01:56:37 PM
13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
జలమయమైన రోడ్లు, మునిగిపోయిన కాలనీలు
మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్(Cloudburst) అయినట్లుగా మూడు గంటల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇటీవలే మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కొరియడంతో వరదలతో ముంచెత్తింది. ఆ పరిస్థితుల నుండి తేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా మళ్లీ భారీ వర్షం కురవడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు.
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి(Medak Hyderabad main road) పూర్తిగా డ్రైనేజీ, వర్షం నీటితో నిండిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ కాలనీని వరద ముంచెత్తింది. దీంతో కాలనీవాసులు ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అలాగే రాజ్ పల్లి గ్రామంలో(Rajpally village) 9.2 సెం.మీ, పాతుర్ గ్రామంలో 8 సెం.మీ భారీ వర్షం కురిసింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.