11-09-2025 02:28:22 PM
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)లో రైల్వే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్(Vikarabad-Krishna new railway line) పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్(Telangana Industrial Sector) కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను, అదే విధంగా రీజనల్ రింగ్ రైల్(Regional Ring Rail) ఆవశ్యకతను అధికారులకు వివరించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్(Bullet train) కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్ తో దూరం కూడా తగ్గుతుందన్నారు. వీటన్నింటి పై నిర్దుష్ట ప్రణాళికలతో కేంద్రంతో సమన్వయంతో ముందుకు వెళ్దామని సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఎంపీ కడియం కావ్య, వేం నరేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ, వికాస్ రాజ్, శ్రీనివాసరాజు, సందీప్ సుల్తానియా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.