నగరంలో భారీ వర్షం
- రోడ్లన్నీ జలమయం
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ సిటీబ్యూరో/యాదాద్రి భువనగిరి, జూన్ 5 ( విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల నాలాలు ఉప్పొంగాయి. చెట్లు విరిగిపడటం, కొమ్మలు విద్యుత్ తీగలకు తాకడం కారణంగా వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్ మాదాపూర్, మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, శిల్పారామం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యధికంగా గోషామహాల్ సర్కిల్ పరిధిలోని బేగంబజార్‌లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సంతోష్ నగర్ సర్కిల్ మేకలమండిలో 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది.
ఇదిలా ఉండగా రోడ్లపై, వీధుల్లో వర్షపు నీరు నిల్వడం, చెట్టు కొమ్మలు విరిగిపడటం వంటి వాటిపై నగర ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులకు 25 ఫిర్యాదులు అందాయి. వీటిలో డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా 21 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించగా, మిగతా 4 ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రహదారుల వెంట వరద ప్రవహించింది. రుతుపవనాల ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మణుగూరు/రంగారెడ్డి, జూన్ 5(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరానికి చెందిన నలుగులు చిన్నారులు మామిడి చెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో మేకల సంతోష్ అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయట పడ్డారు, ఇంకొకరు సురక్షితంగా ఉన్నారు. అలాగే కరకగూడెం మండలం కొత్తగూడెంలో పిడుగుపడి దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి.
రంగారెడ్డి జిల్లాలో..
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని సంకెళ్లపల్లి గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలంలోని గుండాలకు చెందిన బేగరి వెంకటయ్య (52), తలారి నర్సింహలు ఇద్దరూ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం షాద్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో తలదాచుకొనేందుకు రోడ్డు సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. ఇదే సమయంలో భారీ శబ్దంతో కూడిన పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే బేగరి వెంకటయ్య మృతి చెందగా తలారి నర్సింహ తీవ్రంగా గాయపడ్డాడు.






