పీర్జాదిగూడ అవిశ్వాసం వాయిదా!
మేడిపల్లి, జూన్ 5 (విజయక్రాంతి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస పరీక్ష నాటకీయంగా వాయిదా పడింది. ఈ మేరకు కలెక్టర్ నుంచి బుధవారం ఆదేశాలు జారీ కావడం సంచలనం రేపింది. మేయర్ జక్క వెంకట్ రెడ్డి తలపెట్టిన అవిశ్వాసానికి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ పిరాయింపుపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు పెండింగ్‌లో ఉండడంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాస సమావేశాన్ని రద్దు చేసినట్లు పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్‌రావు తెలిపారు. మళ్లీ అవిశ్వాసం ఎప్పుడన్నది తదుపరి కలెక్టర్ ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే 2024 జూన్ 1వ తేదీన మేయర్‌పై చీటింగ్ కేసు నమోదు అయితే జూన్ 5వ తేదీన అవిశ్వాసం నిర్వహించడానికి కొన్ని నిముషాల ముందు కలెక్టర్ ఆర్డర్ జారీ చేయడం కొసమెరుపు.
కలెక్టర్ ఆదేశాలు చట్ట విరుద్ధం..
కలెక్టర్ ఆర్డర్ చట్టవిరుద్ధమని బీఆర్‌ఎస్ పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అవిశ్వాసం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల ప్రాథమిక హక్కు అని, మేయర్ దరఖాస్తును స్వీకరించిన కలెక్టర్ జూన్ 5న అవిశ్వాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశారనితెలిపారు. కానీ మళ్లీ ఆ కలెక్టరే అవిశ్వాసం నిలిపివేతకు మరో ఆర్డర్ జారీ చేయడం విచారకరమన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.






