27 May, 2026 | 11:42 AM

తెలంగాణలో అర్ధరాత్రి వర్షం.. రైతులకు భారీ నష్టం

27-05-2026 10:30 AM

అయ్యో అన్నదాత.. తడిసిపోయిన ధాన్యం

క్యుములోనింబస్ మేఘాల వల్ల.. అకాల వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం రాత్రి భారీగా వర్షం(Heavy Rains) కురిసింది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో అకాల వర్షాలు పడ్డాయి. వేడిగా ఉన్న భూభాగంలోకి తేమగాలుల ప్రవేశంతో వర్షాలు పడ్డాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షం ధాటికి నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.

పెద్దపల్లి మార్కెట్ యార్డుల్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోగా, మక్కలు తడిచిపోయాయి. తుకానికి సిద్ధంగా ఉన్న మక్కల బస్తాల్లోకి వర్షపు నీరు చేరింది. మక్కలను మద్దతుధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిచిన ధాన్యం, మక్కలను ఆరబోసుకుంటూ రైతులు అవస్థలు పడుతున్నారు. మెట్ పల్లి మార్కెట్ లో 4 వేల క్వింటాళ్ల మక్కలు, 6 వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైందని రైతులు కన్నీరుపెట్టుకున్నారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి రామడుగు, గంగాధర మండలాల్లో భారీ వర్షానికి ధాన్యం తడిపోయింది. నెల రోజులుగా ధాన్యం విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ఈదురుగాలుల బీభత్సంతో పెంచాలపల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజల్లో ఇబ్బంది పడ్డారు. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో  జాప్యం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహించారు. అటు అకాల వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

ఏ జిల్లాలో ఎంత వర్షపాతం అంటే?

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తమొల్గరలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం, పర్పల్లిలో 10, భూత్పూర్‌లో 10, నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేటలో 8.8 వర్షపాతం, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 వర్షపాతం, మహబూబ్‌నగర్‌ టౌన్‌లో 7.5 వర్షపాతం, సిద్దిపేట జిల్లా అంగడ కిష్టాపూర్‌లో 6.5 వర్షపాతం, నల్గొండ జిల్లా డిండిలో 6.2 వర్షపాతం, సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 వర్షపాతం, నిజామాబాద్‌ దర్పల్లిలో 5.4వర్షపాతం, వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లో 5 వర్షపాతం, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5 వర్షపాతం, సదాశివనగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు.