28 August, 2026 | 9:22 PM

ఇల్లెందు,టేకులపల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షం

01-09-2025 11:27 AM

వాగులు పొంగి నిలిచిన రాకపోకలు 

ఇల్లెందు/టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం(Torrential rain) కురిసింది. ఈ వర్షానికి ఇల్లందులపాడు చెరువు నాలుగు పొంగి ప్రవహించడంతో మున్సిపాలిటీ లోని సత్యనారాయణపురం రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ గ్రామ సమీపంలోని జెండాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇల్లెందు- మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వర్షం నీరు ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పట్టణంలోని పురవీధులు జలమయంగా మారాయి. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని ఇల్లెందు డిఎస్పి చంద్రబాను ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టేకులపల్లి మండలంలో భారీ వర్షానికి ముర్రేడు వాగు, రాళ్లవాగు, పెద్దవాగు, పుణ్యపువాగు, కరిశాలవాగు, తెల్లవాగు, మద్రాసుతండ - కొండంగులబోడు గ్రామాల మధ్య ప్రవహించే వాగులు ఉదృతంగా పొంగి ప్రవహించాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పత్తి, మొక్కజొన్న పంటలు వరదలకు నీటిలో మునిగాయి.