calender_icon.png 1 September, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

01-09-2025 11:44:05 AM

మానుకోట రహదారులు దిబ్బంధం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): యూరియా కోసం మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) రైతుల పోరు ఉధృత రూపం దాల్చింది. సోమవారం జిల్లాలో మరిపెడ, కురవి, కేసముద్రం మండలాల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. వివిధ చోట్ల రాస్తారోకో నిర్వహించడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేసముద్రం పోలీస్ స్టేషన్ ఎదుట కేసముద్రం వరంగల్ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే మరిపెడ పట్టణంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వందల సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు.

ఇదే తరహాలో కురవి వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పంటలు సాగు చేసి యూరియా లభించక ఎందుకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని, దాదాపు నెల రోజులకు పైగా యూరియా కోసం  తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం యూరియా కోసం ఇబ్బంది పడాలంటూ రైతులు ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. తక్షణం ప్రభుత్వాలు స్పందించి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. పోలీసులు అధికారులు రైతులను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యూరియా ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదంటూ రైతులు భీష్మిస్తున్నారు.