calender_icon.png 12 November, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోలో నరకం

12-11-2025 12:21:57 AM

  1. మహిళల ఒంటిపైన చేతులు 
  2. తినేసే చూపులు.. ఆకతాయిల వేధింపులు 
  3. అసభ్యకర వ్యాఖ్యలు 
  4. రద్దీని ఆసరాగా చేసుకుంటున్న ఆకతాయిలు 
  5. మహిళా కోచ్‌ల్లోనూ మగవారే 
  6. భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్న మహిళలు

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) :  మెట్రో రైలు ప్రయాణం నగరంలోని మహిళలకు ఒక పీడకలగా మారుతున్నది. రోజువారీ ప్రయాణం వారికి మానసిక క్షోభను మిగులుస్తున్నది. కళ్లతోనే తినేసే చూపులు, కావాలనే ఒంటిపై చేతులు వేయడం, అసభ్యకరంగా తాకడం, చెవులు మూసుకునేలా కామెంట్లు చేయడం వంటివి మెట్రో రైలులో నిత్యకృత్యంగా మారాయి. రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు చేస్తున్న ఈ లైంగిక వేధింపుల పర్వం, మెట్రోలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.

మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లు  సైతం కొన్నిసార్లు పురుషు లతో నిండిపోతున్నాయని, ఫిర్యాదు చేయడానికి మెట్రో రైలు లోపల ఎవరూ అందుబాటులో ఉండరని మహిళలు వాపోతున్నారు. మహిళలతో పాటు సీనియర్ సిటిజన్స్‌కు కేటాయించిన సీట్లలోనూ మిగతా వారు నిండిపోతున్నారు. 

రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో కొంద రు అకతాయిలు మెట్రోలో సరైన పద్ధతిలో కూర్చోకపోవడం,  నిలబడే సమ యంలో అటు ఇటు చూసుకుంటూ గట్టి గా మాట్లాడి ఇబ్బంది కలిగించడం లాం టి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు సీనియర్ సిటిజన్స్  పోలీసులకు ఫిర్యా దు చేసే ఓపిక, సమయం లేక వదిలేస్తున్నారు. ఎవరైనా కోపంగా ప్రశ్నిస్తే పొర పాటున తగిలింది.. సారీ అంటూ వాద నకు దిగడం మెట్రోలో సాధారణంగా మారింది. 

ఒళ్లు జలదరించే అనుభవాలు

జేఎన్‌టీయూ నుంచి అమీర్‌పేట వెళ్తున్న ఓ యువతి (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) తన భయానక అనుభవాన్ని పంచుకుంటూ, ‘నా పక్కన కూర్చున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి పదేపదే తన మోచేతితో నా ఒంటికి రాస్తున్నాడు. అసహ్యంగా చూసి మరో కోచ్‌లోకి వెళ్లిపోయాను. కానీ ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది,’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 32 ఏళ్ల రేవతి కృష్ణన్ అనే మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్ట్ మాట్లాడుతూ, ‘శుక్రవారం రాత్రి పూట మెట్రోలో ప్రయాణించా లంటేనే భయమేస్తుంది.

వారాంతం కావడంతో రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. ఈ రద్దీలో అసభ్యంగా తాకే ప్రమాదం చాలా ఎక్కువ,’ అని అన్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్, మియాపూర్, జేఎన్‌టీ యూ, అమీర్‌పేట, రాయదుర్గం వంటి మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ‘ఫిర్యాదు చేద్దామన్నా, రద్దీ లో పొరపాటున తగిలిందని తప్పించుకుంటారు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి మాది,’ అని పలువురు మహిళలు వాపోతున్నారు.

నిరుపయోగంగా ‘టీసేఫ్’ యాప్..

మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీ-సేఫ్’ యాప్‌పై చాలా మందికి అవగాహన లేదు. ఎస్‌ఓఎస్ అలర్ట్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఫేక్-కాల్ ఫీచర్లు ఉన్న ఈ యాప్ గురించి అమీర్‌పేట వంటి స్టేషన్లలో ప్రదర్శనలు ఇచ్చినా, చాలా మంది ప్రయాణికులకు దీని గురించి తెలియకపోవడం గమనార్హం. షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారుల ప్రకారం, హెల్ప్‌లైన్లు, వాట్సాప్, హాక్‌ఐ, టీ-సేఫ్ యాప్‌ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు వెం టనే ఆన్‌బోర్డ్ సిబ్బందికి, ఎమర్జెన్సీ బటన్ల ద్వారా లేదా 100/112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మెట్రో అధికారులు మాత్రం లేడీస్‌కు పత్యేక కోచ్‌లు, ఎమర్జెన్సీ బటన్లు, 24/7 సీసీటీవీ నిఘా వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయ ని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, పర్యవేక్షణ నామమాత్రంగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మహిళా కోచ్‌లను కఠినంగా అమలు చేయడం, రాత్రి సమయాల్లో మహిళా భద్రతా సిబ్బందిని పెంచడం, సీసీటీవీ ఫీడ్‌లను చురుకుగా పర్యవేక్షించడం, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

సంస్కారం ఇంట్లోనే మొదలవ్వాలి.. 

‘మహిళలను గౌరవించడం అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. ఆ బాధ్యత మొదట కుటుంబ సభ్యులపై, ఆ తర్వాత పాఠశాలపై ఉంటుంది,’ అని సైకాలజిస్ట్ కేపీ రాజశేఖర్ అన్నారు. పాఠశాల విద్యా ప్రణాళికలో ఇలాంటి అంశాలను తప్పనిసరిగా చేర్చాలని ఆయన సూచించారు. ఒకప్పుడు మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఇంతకంటే ఎక్కువ భద్రత ఉండేదని, సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతిక విలువలు పతనమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.