6 April, 2026 | 9:06 PM

స్వశక్తి మహిళలకు చేయూత

02-12-2024 12:08 AM
  1. స్త్రీనిధి ద్వారా విద్యుత్ వాహనాలకు రుణాలు
  2. ఆసక్తి చూపించని సంఘం సభ్యులు
  3. సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

మెదక్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు విద్యుత్ వాహనాలను అందించేందుకు స్త్రీనిధి బ్యాం కులు ముందుకు వస్తున్నాయి. అలాగే పెట్రో ధరల పెరుగుదలతో వాహనాలు వినియోగించే నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వీటన్నింటిని అధిగమించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ(పర్యావరణ సహిత) ద్విచక్ర వాహనాలు, ఆటో, ట్రాలీలను అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే స్త్రీనిధి అధికారులు స్వశక్తి సంఘాలలోని మహిళా సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

స్త్రీనిధి ద్వారా మెదక్ జిల్లా వ్యాప్తంగా మహిళలకు విద్యుత్ వాహనాలపై రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనానికి రూ.లక్ష వరకు అందిస్తుండగా, ఆటోలు, ట్రాలీ ఆటోలపై రూ.3 లక్షల వరకు స్త్రీనిధి రుణాన్ని అందిస్తున్నారు.

అయితే జిల్లా పరిధిలోని సంఘాలలోని మహిళలు ఈ రుణాలను తీసుకునేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం ముగ్గురికి మాత్రమే ఈవీ ద్విచక్ర వాహనాలకు సంబంధించి రుణాలు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. 

అర్హులు ఎవరంటే..

స్వశక్తి సంఘంలో సభ్యరాలిగా, సంఘ లావాదేవీలు సరిగా ఉండి, మూలధనం చెల్లించిన మహిళలను ఈ రుణాలకు అర్హులుగా పరిగణిస్తారు. సంఘ ఆర్థిక లావాదేవీ ల్లోని ఏ, బీ, సీ, డీ గ్రేడ్లలో ఏదైనా కేటగిరిలో తప్పనిసరిగా ఉండాలి. గతంలో స్త్రీనిధితో సంఘానికి బకాయి ఉండకుండా చూసుకోవాలి.

ఒక సభ్యురాలు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలు, ఆటో, ట్రాలీ ఆటోలకు 11శాతం వడ్డీపై స్వశక్తి మహిళలకు స్త్రీనిధి రుణాన్ని అందిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు అందిస్తుండగా, అదే విధంగా ఎలక్ట్రిక్ ఆటో, ట్రాలీ, ప్రయాణికులను తరలించే ఆటోలపై రూ.3 లక్షల వరకు అందిస్తున్నారు.

ఇందులో సభ్యురాలు 10 శాతం మార్జిన్ మనీ చెల్లిస్తే, మిగతా ఇచ్చిన రుణాన్ని 60 నెలల్లోపు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న మహిళకు స్త్రీనిధి ద్వారా బీమా కూడా వర్తించనుంది. 

అవగాహన కల్పిస్తాం

పర్యావరణ పరిరక్షణకు ఈ-బైక్, ఆటోలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంధన ధరలు పెరిగిపోయిన తరుణంలో విద్యుత్ వాహనాలతో డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలో వీటిపై అంత ఆసక్తి కనబర్చడం లేదు. ఈ ఏడాదిలో కేవలం ముగ్గురికి మాత్రమే ద్విచక్ర వాహనాలను అందించాం. సంఘం సభ్యులు ముందుకు వస్తే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటిపై మరింత అవగాహన కల్పిస్తాం.

 గంగారాం, 

స్త్రీనిధి జిల్లా మేనేజర్