ఇదిగో లెటర్లు మీకే పంపిస్తున్నాం..
- మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి చర్చలకు ఒప్పించండి
- మంత్రి అడ్లూరి
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పదేపదే అబద్ధమాడుతున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అపాయింట్‌మెంట్ సీఎం రేవంత్‌రెడ్డి కోరనే లేదని, లెటర్ రాయనేలేదని రాంచందర్‌రావు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవం త్‌రెడ్డి లెటర్ రాయకపోతే మహారాష్ట్ర సీఎం ఆఫీసు ఖండించాలి కదా? ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు.
ఉద్దేశపూర్వకం గానే బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని బుధవారం ఆయన ప్రకటనలో ఆరోపించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తే మన రైతులకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మే 6న మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారని, సీఎం రేవంత్‌రెడ్డి మే 26న మరోసారి లేఖ రాశారని, ఈ మెయిల్ అందుకు న్నట్లు మహారాష్ట్ర సీఎం ఆఫీసు అక్నాలడ్జెమెంట్, లెటర్ల కాపీలను రాంచందర్‌రావుకు పంపిస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు. రాంచందర్‌రావు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడున్న వాళ్ల పార్టీ సీఎంను ఒప్పించినా.. మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు.






