16 July, 2026 | 12:03 AM

నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమిది

16-07-2026 12:00 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోందీ చిత్రం.

బుధవారం ఈ సినిమా గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమా నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపో తుంది. కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తా. ఈ సినిమా విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నా” అని చెప్పారు. హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ.. “సినిమా మొత్తం హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది.

ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లో అనేక లేయర్స్ ఉంటాయి. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారు” అన్నారు. డైరెక్టర్ రవి నం బూరి మాట్లాడుతూ.. “నివి, స్టీవెన్ రెండు చాలా బలమైన పాత్రలు. స్టీవెన్ పాత్రను నేను బాగా తీర్చిదిద్దానని పేరొస్తే అది సాయి రాజేశ్ మీద నాకున్న ప్రేమకు నిదర్శనం” అని తెలిపారు. స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది. అందుకే టైటిల్ చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాం” అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “జననాయగన్’ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. మా సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేది ఏం ఉండదు. ఇద్దరూ మాకు మంచి థియేటర్స్ ఇస్తారని నమ్ముతున్నాం. ఒకే సీజన్‌లో రెండు మూడు సినిమాలు ఆడటం చూశాం. కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం” అన్నారు. నటి సిరి హన్మంతు, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.