6 June, 2026 | 1:46 AM

సింగరేణి ఈకో పార్క్, రుద్రంపూర్‌లో హెక్టారు అధిక సాంద్రత మిశ్రమ వృక్షారోపణ

06-06-2026 12:00 AM

చుంచుపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఈకో పార్క్, రుద్రంపూర్లో 1 హెక్టారు విస్తీర్ణంలో అధిక సాంద్రత మిశ్రమ వృక్షారోపణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా అటవీ అధికారి  జి. కిష్ట గౌడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, సింగరేణి అదనపు డైరెక్టర్, సింగరేణి సలహాదారు, ఎస్సీసీఎల్ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, టీఎస్‌ఎఫ్‌ఎసీ డివిజనల్ మేనేజర్, కొత్తగూడెం అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ హరితవనాల విస్తరణ, జీవవైవిధ్య సంరక్షణ మరియు ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యమని వక్తులు అన్నారు. 

ఈ సందర్భంగా సింగరేణి ఈకో పార్క్ ని నిర్దేశిత 1 హెక్టారు విస్తీర్ణంలో వివిధ రకాల స్థానిక, మిశ్రమ జాతులకు చెందిన 100 మొక్కలను నాటారు. ఈ వృక్షారోపణ కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు దోహదపడుతుందన్నారు.

ఎస్సీసీఎల్ ఈకో పార్క్, రుద్రంపూర్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి జి. కిష్ట గౌడ్ మాట్లాడుతూ వృక్షారోపణ, అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వివరించారు. పాల్గొన్న వారందరూ పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ  హరితాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.