6 June, 2026 | 1:43 AM

వేస్ట్ మేనేజ్మెంట్‌లో హుస్నాబాద్‌కు రాష్ట్ర స్థాయి గుర్తింపు

06-06-2026 12:00 AM

మంత్రి సురేఖ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ మల్లికార్జున్

హుస్నాబాద్, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి ‘బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్’ అవార్డు లభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్, పర్యావరణ అధికారి రవికుమార్ శుక్రవారం రోజున ఈ అవార్డును అందుకున్నారు.

పట్టణంలో పరిశుభ్రత, ఇంటింటా చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, హరితహారం కార్యక్రమాల సమర్థ అమలుకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ నాయకత్వంలో మున్సిపల్ సిబ్బంది, పర్యావరణ విభాగం, శానిటేషన్ కార్మికులు, ప్రజల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డు సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఈ గౌరవం హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని గుర్తింపులు సాధించే దిశగా కృషి కొనసాగిస్తామని కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ పేర్కొన్నారు.