‘కూల్’గా దోపిడీ!

25-04-2024 01:57:12 AM

శృతిమించుతున్న కోల్డ్ స్టోరేజీల ఆగడాలు

మిర్చి రైతుల అవసరాలే ఆసరాగా దందా

నో ప్లేస్ బోర్డులు ప్రదర్శిస్తూ అధిక ఫీజులు 

ఖరీదుదారుల చేతుల్లోనే శీతల గిడ్డంగులు

ఖమ్మంకు వెళ్తున్న మిర్చి రైతులు

వరంగల్, ఏప్రిల్24 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడే కర్షకుడు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్నచందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రతికూల పరిస్థితులలో దిగుబడి తగ్గి తండ్లాడుతున్న అన్నదాతలకు ఇప్పుడు వ్యాపారుల సిండికేటు దందా శాపంగా మారింది. మార్కెట్ లో తాము చెప్పిందే వేదం, పెట్టిందే రేటు అనే తరహాలో ఖరీదుదారులు వ్యవహరిస్తుండటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పండిన కొద్దిపాటి మిర్చికి ధర లేక దిగాలు చెందుతున్నారు. తక్కువ ధరకు అమ్మడం ఇష్టంలేక మిర్చి బస్తాలను  కోల్డ్‌స్టోరేజీలో నిలువ చేద్దామనుకుంటే అక్కడా వాటి నిర్వాహకులు ఖాళీ లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పటికే స్టోరేజీలను గుప్పిట్లో పెట్టుకున్న ఖరీదుదారులు తమ రెగ్యులర్ రైతులకు మాత్రమే నిల్వ చేసుకునేలా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వినిపిస్తున్నాయి. విధి లేక కొందరు రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటుండగా మరికొందరు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలోని స్టోరేజీలను ఆశ్రయిస్తున్నారు. ఏనుమాముల మార్కెట్‌లో గత కొద్ది రోజులుగా ఇదే సమస్య ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

ఖరీదుదారుల ఆధిపత్యం

రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కోల్డ్‌స్టోరేజీల నిర్వాహకులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఏనుమాముల మార్కెట్‌కు  ఉమ్మడి వరంగల్ జిల్లా తోపాటు ఖమ్మం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన శివారు గ్రామాల రైతులు కూడా మిర్చిని తీసుకువస్తుండటంతో వేలాదిగా బస్తాలు వస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు పడిపోతుండడంతో రైతులు కోల్డ్‌స్టోరేజీలలో నిలువ చేసేందుకు వెళ్తే అప్పటికే ఖరీదు దారుల చేతుల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజీలలో ఖాళీ లేవనే సమాధానం వస్తుంది. దీంతో రైతులు విధిలేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఒక వేళ పైరవీ చేయిస్తే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. 

ఏనుమాములలో 25 స్టోరేజీలు

ఆసియాలోనే రెండో పెద్దదైన ఏనుమాముల మార్కెట్‌లో  మిర్చి క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గిట్టుబాటు ధర లభించని పక్షంలో రైతులు తమ పంట ఉత్పత్తులను నిలువ చేసుకునేందుకు మార్కెట్ పరిధిలో 25 కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం జరిగింది. వ్యవసాయానికి అనుబంధమైనది కావడంతో స్టోరేజీల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా మార్కెట్‌లో మిర్చి ధరలు పడిపోయినప్పుడు స్టోరేజీలకు డిమాండ్ పెరుగుతుంది. రైతులు మార్చి, ఏప్రిల్ నెలలో మిర్చి బస్తాలు నిల్వ చేసి డిసెంబర్‌లో నెలాఖరు వరకు ఉంచినట్లయితే బస్తాకు రూ.160, ఇన్సూరెన్స్ కింద రూ.8 అంటే మొత్తంగా బస్తాకు రూ.168 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో మిర్చికి ధర పడిపోవడంతో రైతులు కోల్డ్‌స్టోరేజీలను ఆశ్రయిస్తే నిర్వాహకులు ఖాళీ లేవని చెప్తున్నారు. కొందరు వ్యాపారులు, ఖరీదుదారులతో చెప్పిస్తే  అదే అదనుగా రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టోరేజీల నుంచి బస్తాలు తీసి అమ్మేటప్పుడు డబ్బులు చెల్లించాల్సి ఉన్నా రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న స్టోరేజీల నిర్వాహకులు ముందుగానే డబ్బులు వసూలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 

ఖమ్మం వెళ్తున్న రైతులు

వరంగల్ మార్కెట్ పరిధిలో ఉన్న 25 కోల్డ్‌స్టోరేజీలలో ఖాళీగా లేవని చెప్తుండటంతోపాటు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుండటంతో రైతులు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలంలోని కోల్ట్ స్టోరేజీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ స్టోరేజీలలో ఫీజు రూ.142 ఉండటంతో రైతులు ఖమ్మం జిల్లాకు వెళు తున్నారు. అయితే రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతంలోని మిర్చి పండించిన రైతులు నాగ్‌పూర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు అమ్ముకుంటున్నారు. అక్కడ ధర కూడా మంచిగా ఉండటంతో లారీలలో బస్తాలు లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్  ఏనుమాముల మార్కెట్ పరిధిలో ఉన్న కోల్డ్ స్టోరేజీలను సందర్శించి వాటిలో ఖాళీ ఉన్నవా, లేవా అనేది పరిశీలించి తమ ఇబ్బందులను తొలగించాలని రైతులు కలెక్టర్, అధికారులను కోరుతున్నారు.