కూరగాయల సాగుతో రైతులకు అధిక లాభాలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
బస్వరాజు పల్లి లో అంతర పంటల సాగును పరిశీలించిన కలెక్టర్
భూపాలపల్లి, జూన్ 28 (విజయ క్రాంతి): సాంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయలు, అంతర పంటల సాగు రైతులకు లాభదాయకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం బస్వరాజు పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన, ఎల్ నినో ప్రభావంతో వరి బదులుగా తక్కువ నీటితో పండే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. యాదగిరి, మార్త రమేష్, బోర రాజయ్య క్షేత్రాల్లో సాగు చేస్తున్న కూరగాయలు, అంతర పంటలను పరిశీలించి దిగుబడి, యాజమాన్య పద్ధతులు, మార్కెటి్ంప వివరాలు తెలుసుకున్నారు.
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో మంచి ఆదాయం పొందేందుకు అంతర పంటలు ఉపయోగకరమని పేర్కొన్నారు.కూరగాయల సాగుతో కూలీల సమస్య తగ్గుతుందని, మల్చింగ్ వల్ల దిగుబడులు పెరుగుతాయని రైతులు తెలిపారు. ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు వేయడం ద్వారా చీడపీడల ఉధృతి తగ్గి ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని,వ్యవసాయం, ఉద్యానవన శాఖలు సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుల వద్ద నుండి కూరగాయలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం వద్ద కూరగాయల ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేయాలని ఉద్యాన అధికారిని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, రైతులు పాల్గొన్నారు.






