తీరనున్న విద్యార్థుల వ్యథ
- సీఎస్సార్ నిధులతో శౌచాలయ నిర్మాణం
- చొరవ చూపిన కేంద్ర సహాయ మంత్రి సంజయ్
చొప్పదండి, జూలై 28 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు శౌచాలయం లేక పడుతున్న దురవస్థను చూసి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల దురవస్థను తొలగించేందుకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే...కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 227 మంది బాలురు ఉన్నారు. వీరందరికి కలిపి కేవలం ఒకే ఒక్క టాయిలెట్ ఉంది.
అత్యవసర వేళలల్లో విద్యార్థులు నరకయాతన ను అనుభవిస్తున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడి అవస్థలు పడుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే అక్కడ విద్యార్థుల బాధలు తీరే విధంగా శౌచాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్( సీఎస్‌ఆర్) నిధులతో నిర్మాణానికి చొరవ చూపించారు.
మంత్రి ఆదేశాలతో మలయప్ప ఫౌండేషన్ ప్రతినిధులు హెచ్ పి సి ఎల్ కు సంబంధించిన సి ఎస్ ఆర్ నిధులతో పాఠశాల ప్రాంగణంలో 5 మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిర్మాణానికి ముగ్గు పోశారు. వీలైనంత తొందరగా మూత్రశాలలను నిర్మించి విద్యార్థుల వెతలను తీరుస్తానని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంత్రి తీసుకున్న నిర్ణయం, సంస్థ తోడ్పాటుకు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.






