సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 21(విజయ క్రాంతి) : సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చునని, రైతులు సాంప్రదాయ పంటల నుండి లాభసాటి కూరగాయల సాగు వైపు మళ్లడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సాంప్రదాయ పంటలు తగ్గించి కూరగాయల వైపు దృష్టి సారించాలని కోరారు. కూరగాయల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందన్నారు. మంగళవారం టేక్మాల్ మండలం చంద్రు తండాలో కలెక్టర్ పర్యటించారు.
256 మంది రైతులు పండిస్తున్న లాభసాటి కూరగాయల సాగును పరిశీలించి. రైతులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తారని రైతే దేశానికి వెన్నుముక అనే నినాదానికి నిదర్శనంగా చంద్రు తండా నిలుస్తుంది అన్నారు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ లాభసాటి కూరగాయల పెంపకంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు.
టమాటా, కాకర, చిక్కుడు, సొరకాయ సేంద్రీయ ఎరువులతో పెంచడంతోపాటు, తోటలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పెరగడం నాణ్యత గల కూరగాయలు రైతులే స్వయంగా మార్కెట్కు తీసుకుని వెళ్లి వ్యాపారం నిర్వహించుకుని లాభాలు పొందుతున్నారన్నారు.
ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రూపంలో స్ప్రింక్లర్స్ అందించడం జరిగిందని అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతులకు కూరగాయల సాగుకు సంబంధించిన మెలకువలు అందించడం ద్వారా ఆర్థిక చేయూత కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, సంప్రదాయ మూస పద్ధతులకు స్వస్తి పలుకుతున్న రైతులు ఇప్పుడు లాభాల బాట పడుతున్నారని,ఎంతోమంది రైతులు సాగును లాభసాటి వ్యాపారంగా మలుచుకుంటున్నారని తెలిపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను పండించే విధంగా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సర్పంచి స్రవంతి సర్దార్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఏఈఓ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






