6 May, 2026 | 1:42 AM

రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

06-05-2026 12:21 AM

- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు

జన్నారం, మే 5 : కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం మిట్టపల్లిలో గల శ్రీరామ రైస్ మిల్, శివరామకృష్ణ రైస్ మిల్, గుల్లకోటలో గల శ్రీరామచంద్ర రైస్ మిల్ లను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి సందర్శించి రైస్ మిల్లుల నిర్వహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి జాప్యం లేకుండా దిగుమతి చేసుకోవాలని తెలిపారు.

అనంతరం జన్నారం మండలంలోని పొన్కల్, రెండ్లగూడ, మొర్రిగూడ, దండేపల్లి మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యము కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు నిబంధనల ప్రకారం తాలు, తప్ప, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఎఫ్ ఏ క్యూ నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస వసతి సౌకర్యాలు త్రాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని తెలిపారు.

రైతులు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచిన ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, హస్క్ రిమూవర్స్, ఇతర సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జన్నారంలో గల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గోదామును పరిశీలించి మండల కేంద్రంలో గల రాఘవేంద్ర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.