5 March, 2026 | 4:31 AM

శాస్త్రీయ పద్ధతులతోనే వరిలో అధిక దిగుబడులు

05-03-2026 02:41 AM

సమగ్ర సస్యరక్షణపై ఏడీఏ పద్మ సూచనలు

సిద్దిపేట రూరల్, మార్చి 4: నారాయణరావుపేట మండలంలోని బంజేరుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ,ఆత్మ ఆధ్వర్యంలో బుధవారం వరి రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ పద్మ మాట్లాడుతూ విత్తనం నాటినప్పటి నుంచి కోత వరకు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు.

లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి, విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఎరువులు అధిక మోతాదులో వాడకూడదని, ముఖ్యంగా యూరియా నిర్దేశిత పరిమితిలోనే వినియోగించాలని చెప్పారు. యాసంగి పంటకు ఎకరాకు 20 కిలోల జింక్ వాడాలని, కాండం తొలిచే పురుగు నివారణకు నారుమడిలోనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అంకుర దశలో అవసరమైన గుళికల వినియోగం ద్వారా పురుగుమందుల ప్రభావం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పరశురాం రెడ్డి, సర్పంచ్ యాడ భార్గవి, ఆత్మ బీటీఎం భవాని ప్రసాద్, ఏఈవోలు వరుణ్, స్పందనతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.