13 May, 2026 | 6:30 AM

సప్తపది

03-05-2024 12:10 AM

హిందూ వివాహాల చట్టం, దాని ప్రాధాన్యాలపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు నేటి వివాహాలు జరుగుతున్న తీరుకు చెంపపెట్టు లాంటిది. ‘పెళ్లంటే పాటలు, డ్యాన్సులు, విందు వినోదాలు, కట్నకానుకలకు సంబంధించిన కమర్షియల్ ఈవెంట్ కాదు’ అని వ్యాఖ్యానించింది. విందులు, వినోదాలు వివాహ కార్యక్రమంలో భాగం అయితే కావచ్చు. కానీ సంప్రదాయ ప్రకారం సప్తపది నిర్వహిస్తేనే హిందూ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. వివాహ రిజిస్ట్రేషన్ అనేది రుజువు మాత్రమేనని, పెళ్లికి చట్టబద్ధత ఎంతమాత్రం కాదని కూడా స్పష్టం చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు కమర్షియల్ పైలెట్లు  విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ వివాహం హిందూ వివాహ చట్టం ప్రకారం సంప్రదాయ బద్ధంగా జరగలేదని, వివాహాన్ని రిజిస్టర్ మాత్రమే చేసుకున్నామని, అందువల్ల తమ వివాహం రద్దు చేయాలని ఆ జంట తమ విడాకుల  పిటిషన్‌లో పేర్కొంది. ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం హిందూ వివాహాల్లో సంప్రదాయ బద్ధమైన అనేక క్రతువుల గురించి, వివాహబంధం పవిత్రత గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘ఇది ఓ సంస్కారం. పవిత్రమైన మతకర్మ. భారతీయ సమాజంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివాహం అంటే ఆటపాటలు, విందు వినోదాలు, కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకునే సందర్భమో, వాణిజ్యపరమైన లావాదేవో అస్సలు కాదు. ఇది కుటుంబ వ్యవస్థకు బీజం వేసే ఓ గంభీరమైన పునాది కార్యక్రమం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. వివాహంలో భాగంగా నిర్వహించే ‘సప్తపది (వధూవరులు హోమగుండం చుట్టూ కలిసి ఏడడుగులు నడవడం), మాంగల్య ధారణకు సంబంధించిన క్రతువులు లేకుంటే అది వివాహం కిందికి రాదని కూడా పేర్కొంది. ‘1952 నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 కింద వివాహాన్ని నమోదు చేయడం వల్ల రుజువు లభిస్తుంది కానీ, ఆ చట్టంలోని సెక్షన్ 7 మేరకు ఆచార సంప్రదాయాలతో వివాహం నిర్వహించకపోతే చట్టబద్ధత లభించదు’ అని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

ద్దరు వ్యక్తులు గౌరవప్రదంగా జీవితాంతం కలిసి జీవించడానికి అవకాశం కల్పించే పవిత్రమైన క్రతువు వివాహం అని కూడా బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు జరుగుతున్న వివాహాల తంతుకు కనువిప్పు కావాలి. ప్రస్తుతం జరుగుతున్న అనేక వివాహాల్లో  వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం వివాహ ఆచారాలు, సంప్రదాయాలకు ఇవ్వడం లేదనేది నిజం. ఫొటో సెషన్‌పై చూపుతున్నంత శ్రద్ధ వధూవరులు, వారి తల్లిదండ్రులు నిర్వహించాల్సిన క్రతువులపై ఉండడం లేదు. ఫలితంగా ఎన్నో విషయాలు పరిశీలించి దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్త సమయం దాటిపోయాక పెళ్లి తంతు జరుగుతున్న సందర్భాలు కోకొల్లలు. ఆడంబరాల కోసం నిర్వహించే కొన్ని కార్యక్రమాలు ఆహుతులకు, రెండు కుటుంబాల సభ్యులకు ఆనందాన్ని ఇస్తాయనేది కాదనలేని నిజం. 

అయితే, అప్పటివరకు వేర్వేరు కుటుంబాలకు చెందిన వధూవరులు జంటగా మారి రాబోయే రోజుల్లో కొత్త కుటుంబ వ్యవస్థకు పునాది వేసే వివాహ తంతు సంప్రదాయ బద్ధంగా, సజావుగా సాగడం వల్ల ఆ జంట మధ్య అనురాగం, అనుబంధం బలపడి వారు కలకాలం కలిసి ఉండడానికి మార్గం ఏర్పడుతుంది.  వివాహ కార్యక్రమం సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన తర్వాత ఎన్ని వేడుకలు జరుపుకొన్నా బాగుంటుంది. అలా కాకుండా మొత్తం వివాహం ఓ ఈవెంట్ మేనేజిమెంట్  కార్యక్రమంగా జరగడం వల్ల దాని పవిత్రతే దెబ్బతింటుంది. ఈ వాస్తవాన్ని, సర్వోన్నత న్యాయస్థానం చేసిన హితోక్తుల్లోని సారాన్ని అర్థం చేసుకుని వివాహాల వేడుకల్లో ఆడంబరాలను తగ్గించుకుని, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే సార్థకత లభిస్తుంది.