సీఎంల కుటుంబాల మధ్యే మళ్లీ పోరు
కర్నాటకలోని షిమోగా లోక్‌సభ నియోజక వర్గంలో వరసగా అయిదోసారి ఇద్దరు మాజీ ముఖ్యమం త్రుల కుటుంబాల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇలాంటిది ఇప్పటి వరకు జరగ లేదు. 2009 పార్లమెంటు ఎన్నికలు బీఎస్ యెడియూరప్ప, బంగారప్ప కుటుంబాల మధ్య పోటీగా మారినప్పటి నుంచి ప్రతిసారి ఈ రెండు కుటుంబాల మధ్యే పోటీ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లోను యెడి యూరప్ప కుటుంబమే విజయం సాధి స్తూ వస్తోంది. ఆ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన యెడియూరప్ప పెద్ద కుమా రుడు బీవై రాఘవేంద్ర చేతిలో తన తండ్రి, మాజీ సీఎం బంగారప్పకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చు కోవాలని ఆయన కుమారుడు మధు బంగారప్ప భావిస్తున్నారని, ఇది ఆయన ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారిందని నియోజకవర్గంలో ప్రజలు భావిస్తున్నారు.
ఆ ఉద్దేశంతోనే ఆయన తన సోదరి గీతా శివకుమార్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపారు. బంగారప్ప లు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఈ ఎన్నిక వారికి మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే, గత మూడు ఎన్నికల్లో కూడా బంగారప్ప కుటుంబ సభ్యులు జెడి(ఎస్) అభ్యర్థులుగా పోటీ చేశారు. నియోజక వర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీకి కాస్త పట్టు ఉంది. అంతేకాకుండా అప్పుడు జెడి(ఎస్) భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆ పార్టీకి బదిలీ కాలేదని చెప్తారు. అయితే, ఇప్పుడు మాత్రం గీతా శివకుమార్‌కు నియోజక వర్గంలో గట్టి పట్టు ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ మద్ద తు నిండుగా ఉండడం కలిసొచ్చే అంశం.
కాంగ్రెస్ గ్యారెంటీలే ట్రంప్ కార్డు
స్థానిక సమస్యలు తెరమరుగైన నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారంటీలు బీజేపీ బ్రహ్మాస్త్రమైన ‘మోడీ వేవ్’ను ఎదుర్కోవడానికి గీతకు ట్రంప్ కార్డుగా మారాయి. ‘ప్రతి నెలా దాదాపు రూ.5 వేల రూపాయలు మాకు లభిస్తున్నప్పుడు మేము సిద్ధరామయ్య ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. మేము ఈసారి కాంగ్రెస్‌కే ఓటు వేస్తాం’ అని ఓ మధ్యతరగతి గృహిణి అంటున్న మాటలు నియోజక వర్గంలోని ప్రతి మహిళ మనసులోని మాటగానే కనిపిస్తోంది. అంతేకకుండా, సంఖ్యా పరంగా దాదాపు 2 లక్షలదాకా ఉన్న ఈడిగ కులానికి చెందిన ఓట్లు గీతకు అనుకూలంగా మారాయన్న మాటకూడా బలంగా వినిపిస్తోంది. వరస ఓటముల పాలయినందుకు ఆ కుటుం బం పట్ల సానుభూతితోపాటుగా బీజేపీ తమను నిర్లక్ష్యం చేసిందన్న భావన ఆ కులం వాళ్లలో ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
బీజేపీకి రెబల్ బెడద
మరోవైపు ఇటీవల పార్టీనుంచి బహిష్కరణకు గురయిన సీనియర్ నాయ కుడు కెఎస్ ఈశ్వరప్ప రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం బీజేపీకి పెద్ద తలనొప్పి మారింది. ఆయన ప్రభావం షిమోగా నగరానికి పరిమితమైనప్పటికీ బీజేపీ ఓట్లను కొంతమేర ఆయన దెబ్బతీసే అవకాశం ఉండడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. అంతమాత్రాన బీజేపీ డీలా పడిందని అర్థం కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్)లు పొత్తులో ఉన్నప్పుడే నియోజక వర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత సాధించడమే కాకుండా 2.23 లక్షల మెజార్టీతో ఆ పార్టీ విజయం సాధించిం ది. ఈసారి జేడీ(ఎస్) తమ పక్షాన ఉన్నందున అలాంటి భారీ మెజార్టీతోనే గెలు పొందుతామని ఆ పార్టీ ధీమాగా ఉంది. బలమైన సంస్థాగత నెట్‌వర్క్‌ను కలిగి ఉండడమే కాకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ప్రచారం ప్రారంభించిన కమలనాథులు ‘మోడీ వేవ్’తో కాంగ్రెస్ గ్యారంటీల ప్రభావాన్ని దీటుగా ఎదుర్కోగలమని భావిస్తున్నారు.
‘కాంగ్రెస్ ప్రభు త్వం నుంచి మాకు లబ్ధి లభిస్తుండవచ్చు. కానీ, మేము మాత్రం బీజేపీకే ఓటు వేస్తాం. ఎందుకంటే, దేశానికి ఆయన అవసరం’ అని స్థానిక కువెంపు యూనివర్సిటీలో పి.హెచ్‌డి చదువుతున్న పవిత్ర చేసిన వ్యాఖ్యలు ఓటర్ల రెండో మనోభావనకు అద్దం పడుతున్నాయి. అంతేకా కుండా, బెంగళూరులో ఉంటున్న గీత స్థానికురాలు కాదని, రాఘవేంద్ర ఇక్కడే ఉంటారని, స్థానికులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా ఓటర్లలో బాగా నే ప్రభావం చూపుతోంది. బీజేపీకి కొండంత బలం లింగాయత్‌లలో బలమైన నాయకుడైన మాజీ సీఎం యెడి యూరప్పేనని చెప్పాలి. ఎన్నో ఎన్నికలు చూసిన ఆయన ఆ పార్టీకి భీష్మాచార్యుడితో సమానం. ప్రస్తుతానికయితే ఇరువురి మధ్య పోటీ ‘నువ్వా నేనా’ అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో భాగంగా షిమోగాతోపాటుగా 14 నియోజక వర్గాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది.






