ఏ ఎన్నికల్లో ఎవరెవరు?
న్యూఢిల్లీ, జూన్ 3: మరికొద్ది గంట ల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఆరు వారాల నిడివిలో మొత్తం ఏడు దశల్లో 18వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తుండగా, పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని ఆశిస్తోంది. ఈ రోజు ప్రకటించబోయే ఫలితాలు కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయిస్తాయి. స్వాతంత్య్రం తర్వాత 1951లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల నుంచి 2019 వరకు 17 ప్రభుత్వాలు మారాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాయి. ఈ 17 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు అధికారం పొందారో ఓసారి పునరావలోకనం చేసుకుందాం.
1951
జవహార్‌లాల్‌నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నెహ్రూ భారత్‌కు మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. మొత్తం 489 స్థానాలకు గాను కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. పోలైన ఓట్లలో దాదాపు 45 శాతం ఓట్లను దక్కించుకుంది. రెండో అతిపెద్ద పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నిలిచింది. సీపీఐ 16 స్థానాల్లో గెలుపొందింది. 12 సెగ్మెంట్లలో గెలిచి సోషలిస్ట్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించగా 44.9 శాతం ఓటింగ్ నమోదైంది.
1957
రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 494 సీట్లకు గాను 371 స్థానాల్లో గెలుపొందింది. 47.8 శాతం ఓట్ షేర్ దక్కింది. 27 స్థానాలతో సీపీఐ రెండో స్థానంలో, 19 స్థానాలతో ప్రజా సోషలిస్ట్ పార్టీ మూడో స్థానంలో నిలిచాయి. ఓటింగ్ శాతం 45.4గా నమోదైంది.
1962
మూడో పార్లమెంట్ ఎన్నికల్లో నెహ్రూ హ్యాట్రిక్ కొట్టారు. 494 సీట్లలో కాంగ్రెస్ 361 దక్కించుకోగా ఓట్ షేర్ 44.7 శాతం వచ్చింది. రెండో స్థానంలో సీపీఐ (29 సీట్లు), మూడో స్థానంలో స్వతంత్ర పార్టీ (18 సీట్లు) నిలిచాయి. మొత్తం ఓటింగ్ శాతం 55.4గా నమోదైంది.
1967
ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. 520 సీట్లకు గాను 283 స్థానాల్లో గెలుపొందింది. ఓట్ షేర్ 40.8 శాతం. 44 సీట్లతో రెండో స్థానంలో స్వతంత్ర పార్టీ, భారతీయ జన సంఘ్ (బీజేపీకి పూర్వపు పార్టీ) 35 సీట్లతో మూడో ప్లేస్ దక్కించుకుంది. మొత్తం ఓటింగ్ శాతం 61గా నమోదైంది.
1971
ఇందిరాగాంధీ వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఇందిరా కాంగ్రెస్‌కు 518 స్థానాలకు గాను 352 స్థానాలు దక్కాయి. 43.7 శాతం ఓట్ షేర్ దక్కింది. 25 సీట్లతో సీపీఎం రెండో స్థానంలో, సీపీఐ (23 సీట్లు) మూడో స్థానంలో నిలిచాయి. 60.5 ఓటింగ్ శాతం నమోదైంది.
1977
మొదటిసారి జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. భారతీయ లోక్‌దళ్ (బీఎల్‌డీ) విజయం సాధించి తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఎల్‌డీకి 542 సీట్లకు గాను 295 స్థానాలు దక్కాయి. ఓట్ షేర్ 41.3. కాంగ్రెస్ 154 స్థానాలతో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఇందిరాగాంధీ దేశంలో మొదటి ఎమర్జెన్సీని 1975లో విధించిన తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. అత్యవసర పరిస్థితిలో వేల మంది విమర్శకులను, రాజకీయ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మూడోస్థానంలో నిలిచిన సీపీఎం 22 సీట్లు నెగ్గింది. 60.5 ఓటింగ్ శాతం నమోదైంది.
1980
మళ్లీ ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 529 సీట్లకు గాను 353 స్థానాల్లో గెలుపొందింది. 42.7 శాతం ఓట్ షేర్ దక్కింది. జనతాపార్టీ (సెక్యులర్) 41 స్థానాలతో రెండో ప్లేసులో, 37 స్థానాలతో సీపీఎం మూడో ప్లేసులో నిలిచాయి. 56.9 ఓటింగ్ శాతం నమోదైంది.
1984
ఇందిరా హత్య జరిగిన తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 514 స్థానాలకు గాను రికార్డు స్థాయిలో 404 సీట్లలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రేక్ కాలేదు. ఓట్ షేర్ 49.1 శాతం దక్కింది. 30 స్థానాల్లో గెలుపుతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండో ప్లేసులో నిలిచింది. 22 సీట్లతో సీపీఎం మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం ఓటింగ్ శాతం 63.6గా నమోదైంది.
1989
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మెజారిటీ సాధించలేదు. ప్రతిపక్షంలో ఉన్న జనతాదళ్, బీజేపీ పొత్తు కూడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 529 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 197, జనతాదళ్ 143, బీజేపీ 85 స్థానాల్లో గెలుపొందాయి. ఓటింగ్ శాతం 61.9గా నమోదైంది.
1991
పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ప్రధాని అయ్యారు. 521 స్థానాలకు గాను కాంగ్రెస్ 232 స్థానాల్లో గెలుపొందింది. 120 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 59 సీట్లతో జనతాదళ్ మూడో స్థానంలో నిలిచాయి. ఓటింగ్ శాతం 56.7గా నమోదైంది.
1996
అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 543 సీట్లకు గాను బీజేపీ 161, కాంగ్రెస్ 140, జనతాదళ్ 46 సీట్లు సాధించాయి. బీజేపీ ఓట్ షేర్ 20.3 శాతం. ఓటింగ్ శాతం 57.9గా నమోదైంది.
1998
బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఫలితాలు వచ్చిన 3 నెలల తర్వాత 1998 మేలో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయీ ప్రధాని అయ్యారు. 543 స్థానాలకు గాను బీజేపీ 182, కాంగ్రెస్ 141, సీపీఎం 32 స్థానాలు దక్కించుకున్నాయి. బీజేపీ ఓట్ షేర్ 20.3 శాతం. మొత్తం ఓటింగ్ శాతం 57.9గా నమోదైంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం) ఉపయోగించారు. 16 నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించగా మిగతా స్థానాల్లో బ్యాలెట్ పేపర్‌ను వాడారు.
1999
వాజ్‌పేయీ నేతృత్వంలోని బీజేపీ 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఓట్ షేర్ 23.8 శాతం. కాంగ్రెస్ 114, సీపీఎం 33 స్థానాలు సాధించాయి. మొత్తం ఓటింగ్ శాతం 60గా నమోదైంది. 46 నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు.
2004
సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 145 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 26.5 శాతం. బీజేపీ 138, సీపీఎం 43 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం ఓటింగ్ శాతం 58.1గా నమోదైంది. ఈ ఎన్నికల నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించడం ప్రారంభించారు.
2009
మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ 206 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఓట్ షేర్ 28.6శాతం. యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 116, సమాజ్‌వాదీ పార్టీ 23 స్థానాలు సాధించాయి. మొత్తం ఓటింగ్ శాతం 58.2గా నమోదైంది.
2014
నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ విజ యం సాధించింది. 1984 తర్వాత మూడు దశాబ్దాలకు ఓ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. బీజేపీ 31.3 శాతం ఓట్ షేర్‌తో 282 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 44, అన్నాడీఎంకే 37 స్థానాల్లో గెలిచాయి. మొత్తం ఓటింగ్ శాతం 66.4గా నమోదైంది.
2019
నరేంద్రమోదీ వరుసగా రెండో సారి విజయం సాధించారు. బీజేపీ 38 శాతం ఓట్ షేర్‌తో 303 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 52, డీఎంకే 23 సీట్లు దక్కించుకున్నాయి. మొత్తం ఓటింగ్ శాతం 67గా నమోదైంది.






