కిరాక్ కోహెడ
హైదరాబాద్ అంటే రణగొణధ్వనులు.. కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు.. రాక్ సిటీ కూడా. ఒకసారి హైదరాబాద్ శివారుకెళ్తే అరుదైన రాళ్లు, అబ్బురపరిచే గుట్టలు అట్రాక్ట్ చేస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో రాళ్లు, గుట్టలు కనమరగువుతున్న క్రమంలో కోహెడ గుట్ట ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారుతోంది.
సిటీకి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకోని ఉన్న ఈ కొండపైకి రోడ్డు సౌకర్యం కూడా ఉంది. దీంతో చాలామంది ఈ కొండను చూసేందుకు వస్తుంటారు. చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి గడుపుతుంటారు. ఇక్కడ గుట్టలపై సేదతీరడమే కాకుండా ట్రెక్కింగ్ కూడా చేస్తుంటారు. కోహెడ గుట్టపైకి చేరుకున్న తర్వాత అ క్కడి బండరాళ్లను ఎక్కుతూ సరదాగా గడుపుతుంటారు.
ఈ కొండపై నుంచి సంఘీ టెంపుల్‌తో పాటు పాటు రామోజీ సిటీ కూడా కనిపిస్తుంది. ఈ గుట్టపై నెమళ్లతో పాటు పలు రకాల జంతువులు కూడా కనిపిస్తాయి. ఇక ఇక్కడ అదిరిపోయే వ్యూపాయింట్ కూడా ఉంది. పైకి వెళ్లిన తర్వాత పెద్దగా కొండ అంచు ఉంటుంది. అక్కడ్నుంచి చూస్తే ఔటర్ రింగు రోడ్డు ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. సిటీ అందాలతో పాటు ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతమంతా భూమికి పచ్చని రంగేసినట్టుగా ఉంటుంది. ఎల్బీ నగర్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కోహెడకు వెళ్లొచ్చు.






